వ్యవసాయ విధానాలపై వరుణ్ గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ: బిజెపి ఎంపి వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పండించిన పంటను అమ్ముకోలేకపోయిన ఒక రైతు తన చేతులతో పంటను తగలబెట్టుకుంటున్న వీడియోను వరుణ్ గాంధీ శనివారం సామాజిక మాధ్యమంలో ట్వీట్ చేశారు. మనకు తిండి పెట్టే వారిని మనం కాపాడుకోలేకపోతే అది ఈ దేశ ప్రజలందరి వైఫల్యం అంటూ వరుణ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సుమోధ్ సింగ్ అనే రైతు గత 15 రోజులుగా తాను పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు మండీల చుట్టూ తిరుగుతున్నాడని, పంట అమ్ముడుకాకపోవడంతో నిస్పృహతో తన పంటను తన చేతులతోనే తగలబట్టేందుకు అతను సిద్ధపడ్డాడని వరుణ్ తెలిపారు. ప్రభుత్వ విధానాలు రైతులకు ఏం దుస్థితిని తెచ్చిపెట్టాయి..మన వ్యవసాయ విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందంటూ వరుణ్ పిలుపునిచ్చారు. తన పంటకు తానే నిప్పంటించడానికి మించిన శిక్ష రైతులకు మరొకటి ఉండదని, తమ తప్పు లేకపోయినా రైతులు ఈ దుస్థితిలోకి నెట్టివేయబడడానికి కారణమేమిమో మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవలసి ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలపై గత కొంతకాలంగా వరుణ్ గాంధీ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల పట్ల ఆయన సానుభూతిని కూడా వ్యక్తం చేశారు.