జి20, కాప్26 సదస్సులకు హాజరు కానున్న మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకు ఉంటుందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అక్టోబర్ 30, 31 తేదీల్లో ఇటలీలోని రోమ్‌లో జరిగే 16వ జి20 సదస్సులో ప్రధాని పాల్గొంటారని, ఆ తర్వాత యుకెలోని గ్లాస్గోలో జరిగే పర్యావరణ సదస్సు కాప్26కు హాజరవుతారని తెలిపారు. ఆర్థికంగా బలమైన దేశాలతో ఏర్పాటైన జి20కి గతేడాది డిసెంబర్ నుంచి ఇటలీ అధ్యక్షత వహిస్తోంది. 2023లో జి20 సదస్సుకు మొదటిసారి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. 1999 నుంచి ఏటా నిర్వహించే జి20 సదస్సుకు సభ్య దేశాల అధినేతలు హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రపంచ పర్యావరణంలో వస్తున్న మార్పులపై కాప్ సదస్సులో చర్చిస్తారు. పర్యావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలతో ఈ సదస్సును నిర్వహిస్తారు. కాప్26కు ఈసారి యుకె ఆతిథ్యమిస్తోంది. ఈ సమావేశాలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు జరగనున్నాయి. అయితే, దేశాధినేతల సదస్సును నవంబర్ 1,2 తేదీల్లో నిర్వహిస్తున్నారు. 1,2 తేదీల్లో జరిగే సదస్సుకు ప్రధాని మోడీ హాజరవుతారు. 120 దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరు కాగలరని భావిస్తున్నారు.