బంగ్లాదేశ్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో ఘన విజయం
షార్జా: టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. సూపర్12 లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చరిత్ అసలంక (49 బంతుల్లో 5 సిక్స్‌లు,5 ఫోర్లతో 80), రాజపక్స( 31 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్స్‌లతో 53) చెలరేగడంతో బంగ్లాదేశ్ నిర్దేశించిన 172 పరుగుల భారీ లక్షాన్ని మరో 7 బంతులు మిగిల ఉండగానే ఛేదించింది. లక్ష ఛేదనకు దిగిన శ్రీలంకకు తొలి ఓవర్‌లోనే గట్టి దెబ్బ తగిలింది. కుశాల్ పెరీరా(1)ను నసూమ్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన అసలంక మరో ఓపెనర్ నిశాంక(24)తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ముఖ్యంగా అసలంక సిక్స్‌లు, ఫోర్లు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అయితే షకీబ్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో నిశాంక, ఫెర్నాండో(0) ఔటయ్యారు.తర్వాతి ఓవర్లోనే హసరంగ(6) కూడా ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 4 వికెట్లకు 79 పరుగులు మాత్రమే. దీంతో ఆ జట్టు కష్టాల్లో పడినట్లు కనిపించింది.
అయితే ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన రాజపక్సతో కలిసి అసలంక స్కోరును పరుగులు తీయించాడు. వీరిద్దరూ అయిదో వికెట్‌కు 89 పరుగులు జోడించడంతో శ్రీలంక విజయం సుసాధ్యమైంది. మహమ్మదుల్లా వేసిన 14వ ఓవర్‌లో అసలంక రెండు సిక్సర్లు బాదాడు. సైఫుద్దీన్ వేసిన 16వ ఓవర్‌లో రాజపక్స చెరేగి పోయాడు. ఏకంగా రెండు సిక్స్‌లు, మరో రెండు ఫోర్లు బాదాడు. దీంతో శ్రీలంక విజయం ఖరారయింది. 53 పరుగులు చేసిన అనంతరం రాజపక్స ఔటయినప్పటికీ శ్రీలంక అదే జోరును కొనసాగిస్తూ విజయ లక్షాన్ని సునాయాసంగా చేరుకుంది. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్, సౌఫుద్దీన్‌లు చెరి రెండు వికెట్లు తీయగా, నసూమ్ ఒక వికెట్ పడగొట్టాడు.
రాణించిన నయీం, రహీమ్
అంతకు ముందు టాస్ ఓడి బాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ మహమ్మద్ నయీం (52 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు), రహీమ్ (57 నాటౌట్, 37 బంతుల్లో 2 సిక్స్‌లు,5 ఫోర్లు)), అర్ధ శతకాలతో రాణించి తమ జట్టు బారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. లిటన్ దాస్(16)తో కలిసి నయీం తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. స్వల్ప వ్యవధిలోనే దాస్, షకీబ్ అల్ హసన్(10) ఔటైనా.. నయీం, ముషిఫకర్ రహీమ్‌ల జోడీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. అయితే నయీం పెవిలియన్ చేరడంతో రహీం బ్యాట్‌ను ఝళిపించాడు. చివర్లో మహమ్మదుల్లా కూడా అయిదు బంతుల్లో 10 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. శ్రీలంక బౌలర్లలో స్టార్ బౌలర్ చమీరా భారీగా పరుగులు సమర్పించుకోగా, చమిక, లాహిరు కుమార, ఫెర్నాండోలు తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆటగాళ్ల మాటల యుద్ధం
కాగా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ బౌల్ చేసిన శ్రీలంక బౌలర్ లహీర్ కుమార .. ఐదో బంతికి లిటన్ దాస్‌ను పెవిలియన్‌కు పంపాడు. అయితే ఈ క్రమంలో లిటన్ దాస్ వైపు చూస్తూ లహీర్ కుమార మాటల తూటాలు పేల్చాడు. లిటన్ దాస్ కూడా తానేమీ తక్కువ తినలేదంటూ అతనితో వాదనకు దిగాడు. దీంతో ఇద్దరు క్రికెటరల మధ్య వాగ్వాదం జరగడంతో ఫీల్డ్ అంపైర్లు, సహచర ఆటగాళ్లు కలుగజేసుకుని సర్ది చెప్పారు.