జనవరి 1 నుంచి అమలు
బీజింగ్ : భారత్‌లో ఉద్రిక్తతల నేపధ్యంలో చైనా నూతన సరిహద్దు చట్టాన్ని అమలు లోకి తెచ్చింది. సార్వభౌమత్వం,ప్రాదేశిక సమగ్రత పేరుతో రూపొందించిన ఈ చట్టంలో చైనా ప్రజలు సరిహద్దుల్లో నివసించేలా, పనిచేసుకునేలా ప్రోత్సహించనున్నట్టు పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడనున్నట్టు తెలియచేసింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో స్పష్టం చేసింది. శనివారం చైనా జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశంలో ఈ నూతన చట్టానికి ఆమోద ముద్ర పడింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది అమలు లోకి వస్తుంది. సమానత్వం, పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక సంప్రదింపులు అనే సూత్రాల ద్వారా సరిహద్దు వ్యవహారాలను నిర్వహిస్తామని, చర్చల తోనే పొరుగు దేశాలతో వివాదాలు పరిష్కరించుకుంటామని చైనా వెల్లడించింది. ఈ తాజా చట్టం భారత్‌తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.