మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) అధ్యక్షుడిగా కెసిఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య ఎన్నికను ప్రకటించారు. కెసిఆర్ వరుసగా తొమ్మిదోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్‌ను ప్రతిపాదిస్తూ 18 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని. పార్టీలోని అన్ని విభాగాల నాయకులు, అన్ని సామాజిక వర్గాల నాయకులు కెసిఆర్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారని, అధ్యక్ష పదవికి ఇతరులు ఎవరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదని ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సిఎం కెసిఆర్‌కు పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్లీనరీ ప్రాంగణానికి కెసిఆర్ రాకతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా గులాబీ దళపతి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అమరవీరులకు నివాళు లర్పించారు. వేదిక వద్దకు చేరుకున్న కేసిఆర్‌కు హోమంత్రి మహమూద్ అలీ దట్టి కట్టారు. టిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కెసిఆర్ ఎన్నికైన విషయాన్ని పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు ప్లీనరీ వేదిక మీది నుంచి గుర్తు చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ ఏర్పడి 20 ఏళ్లు అవుతోంది. టిఆర్‌ఎస్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే కాకుండా గత ఏడేళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. జలదృశ్యం వేదికగా టిఆర్‌ఎస్‌ను కెసిఆర్ ప్రారంభించారు. అప్పటినుంచి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. తనను టిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.
గులాబీ మయం
ప్లీనరీ వేదిక మీదా, సభా ప్రాంగణంలోనే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముఖ్య కూడళ్లలో ప్రధాన రహదారులపై టిఆర్‌ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో మహిళలకు, పురుషులకు, మీడియాకు ప్రతినిధులకు, విఐపిలకు ప్రత్యేక గ్యాలరీలు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజా ప్రతినిధుల కోసం ప్రధాన ద్వారాల వద్ద 39 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్లీనరీకి హాజరైన వారికి 33 రకాల వంటకాలతో విందు ఇచ్చారు.
KCR Elected as TRS President for 9th