శ్రీనగర్ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)ను భారత్‌లో విలీనం చేయాలన్న ప్రణాళిక ప్రస్తుతం ఏదీ లేదని, అయితే ఏదో ఒక రోజు మొత్తం కశ్మీర్‌ను భారత్ తనలో భాగం చేసుకుంటుందని, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (ఏ ఒసిఇన్‌సీ), వెస్టర్న్ ఎయిర్ కమాండ్, ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్ చెప్పారు. భారతీయ దళాలు బుడ్గామ్‌లో దిగిన సంఘటనకు సంబంధించి 75 వ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజలను పాకిస్థానీయులు న్యాయబద్ధంగా చూడడం లేదని పేర్కొన్నారు.. 1947 అక్టోబర్ 27 న భారత వాయుసేన, సైన్యం నిర్వహించిన కార్యకలాపాల కారణం గానే భారత్ లోని కశ్మీర్‌కు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లభించాయని, రానున్న సంవత్సరాల్లో యావత్ కశ్మీర్ భారత్‌లోనే ఉంటుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలకు భారత్ లోని ఇతర ప్రాంతాల ప్రజలకు ఉమ్మడి అనుబంధాలు ఉన్నాయని చెప్పారు. దేశాలు సమష్టిగా ఏకతాటిపైకి రావడాన్ని చరిత్ర చెబుతోందని, భగవంతుడు కోరుకుంటే అది సాధ్యమౌతుందన్నారు. పాకిస్థానీ గిరిజనులు దాడులు సాగించడంతో ఆనాడు కశ్మీర్ మహరాజు హరిసింగ్ తన రాజ్యాన్ని భారత్‌లో కలిపేందుకు అంగీకరిస్తూ సంతకం చేశారని, ఆ మర్నాడు 1947 అక్టోబర్ 27 న భారత దేశ సైన్యాలు కశ్మీరు చేరుకున్నాయని గత సంఘటన గుర్తు చేశారు. డ్రోన్ల దాడులు గురించి అడగ్గా, వాటివల్ల స్వల్పనష్టమే తప్ప మరేం లేదన్నారు. డ్రోన్ల దాడులకు వ్యతిరేకంగా తమ వద్ద సరైన సాంకేతిక వ్యవస్థ ఉందని, అయితే మరిన్ని డ్రోన్లను సంపాదించుకున్న తరువాత డ్రోన్ల దాడులను తిప్పికొట్టే సామర్ధం సాధిస్తామన్నారు. ఐక్యరాజ్యసమితి జోక్యం లేనట్టయితే ఈపాటికి మొత్తం కశ్మీర్ మనదే అయి ఉండేదని అభిప్రాయపడ్డారు.