Friday, November 22, 2024

ఉపాధ్యాయుడు సుధాకర్ సేవలకు దక్కిన పురస్కారం….

- Advertisement -
- Advertisement -

Best teacher award goes to Sudhakar

మన తెలంగాణ/ములకలపల్లి : ములకలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధారావత్ సుధాకర్‌కు ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డ్‌ను అందుకున్నారు. ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులను అవార్డ్‌లకు ఎంపిక చేస్తుంది. అందులో భాగంగా సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో సుధాకర్‌కు ప్రశంసా పత్రం, అవార్డును అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. సుధాకర్‌కు అవార్డు రావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, ఇతర ఉపాధ్యాయులు, ములకలపల్లి, రామాంజనేయపురం, మోటుగూడెం గ్రామస్తులు సుధాకర్‌ను అభినందించారు. కామెపల్లి మండలం లాల్యా తండా గ్రామంలో సక్రి, మంగ్యా దంపతులకు సుధాకర్ జన్మించారు. ఎంఎ, బిఇడి, వివిధ కోర్సులను పూర్తి చేసిన అనంతరం 2002 సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా ఎంపికై మోటుగూడెం ప్రాధమిక పాఠశాలలో విధులలో చేరారు. 2009లో రామాంజనేయపురం పాఠశాలకు బదిలీపై వెళ్ళారు. అనంతరం 2018 నుండి ములకలపల్లి ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. తాను ఏ పాఠశాలలో పనిచేసినా ఆ పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవడంలో ఆయనకు అయనే సాటి అని నిరూపించుకున్నారు.

మారుమూల మోటుగూడెం ప్రాంతంలో పనిచేస్తూ విద్యార్థులను పాఠశాలకు రప్పించి వారిని తీర్చిదిద్దడంలో సుధాకర్ చూపిన చొరవకు గ్రామస్తులు నేటికీ ఆయనను స్మరించుకుంటారు. రామాంజనేయపురం పాఠశాలలో పని చేస్తున్న కాలంలో గ్రామస్తులు, తల్లిదండ్రుల సహకారంతో 25,000 ఖరీదు అయిన సిమెంట్ బల్లలను విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా నాడు ఆయన నాటిన మొక్కలు నేడు ఫల సాయాన్ని విద్యార్థులకు ఇస్తున్నాయి. ములకలపల్లి పాఠశాలలో పని చేస్తూ ప్రధానోపాధ్యాయుడు శంకర్ సహాయ సహకారాలతో పాఠశాలలో హరితహారం, యోగా, మెడిటేషన్, ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించడానికి విశేష కృషి చేశారు. ప్రధానోపాధ్యాయుడు శంకర్ సహకారం తాను మరువలేనని తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు అందించిన స్ఫూర్తితోనే పాఠశాలలో రికార్డ్ స్థాయిలో పిల్లలను చేర్పించడమే కాకుండా నాణ్యమైన విద్యాబోధనను అందించగలుగుతున్నామని సుధాకర్ పేర్కొంటారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో మండల జెఎసి చైర్మన్‌గా పని చేస్తూ సకలజనుల సమ్మెలో పాల్గొని అందరి మన్ననలను పొందిన సుధాకర్ విద్యాబోధనలో కూడా పాఠశాలలో దాతల సహకారంతో డిజిటల్ క్లాస్‌రూం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు హిందీ బోధనతో పాటు నవోదయ కోచింగ్ ఇవ్వడంతో పాటు పలువురు విద్యార్థులు నవోదయకు ఎంపిక అవడానికి విశేష కృషి చేశారు. హరితహారం అంటే తనకు ప్రాణమని విద్యార్థులను తీర్చిదిద్దడం అంటే తనకు మక్కువ అని ఉపాధ్యాయుడు సుధాకర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News