ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచకప్ రెండో మ్యాచ్‌లో పాల్గొనే టీమిండియాలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ కెప్టెన్ సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలై న టీమిండియాకు కివీస్‌తో జరిగే పోరు చాలా కీలకమన్న విషయాన్ని మరువ కూడదన్నాడు. ఈ మ్యాచ్ లో ఓడితే సెమీఫైనల్ ఆశలు వదులుకోక తప్పదన్నాడు. దీంతో కీలకమైన ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో రెండు మార్పులు చేయక తప్పదన్నాడు.
అంతంత మాత్రం ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యలను తప్పించి వారి స్థానంలో శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్‌లను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. హార్దిక్‌తో పోల్చితే ఇషాన్ కిషన్ మెరుగైన బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఐపిఎల్ లో చివరి మ్యాచుల్లో ఇషాన్ అసాధారణ బ్యాటింగ్ తో చెలరేగిన విషయాన్ని గవాస్కర్ గుర్తు చేశాడు. ఈసారి అతనికి చోటు కల్పిస్తే టీమిండియా బ్యాటిం గ్ మరింత బలోపేతమవుతుందన్నాడు. ఇక భువనేశ్వర్ స్థానంలో శార్దూల్‌ను ఆడించడమే ఉత్తమమన్నాడు. బ్యాట్‌తో, బంతితో రాణించే సత్తా అతనికుందన్నాడు. దీంతో శార్దూల్‌కు చోటు కల్పించడ మే మేలని గవాస్కర్ స్పష్టం చేశాడు.