న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పదవి కాలాన్ని ప్రభుత్వం మరో మూడేళ్లు పొడగించింది. ఈ పొడగింపు 2021 డిసెంబర్ 10 నుంచి అమలు కానున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. శక్తికాంత దాస్ 2018 డిసెంబర్‌లో మూడేళ్ల కోసం ఆర్‌బిఐ గవర్నర్‌గా నియుక్తులయ్యారు. ఆయనకు ముందు ఉర్జిత్ పటేల ఆ పదవిలో ఉండేవారు. శక్తికాంత దాస్ పదవి కాలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ‘ది అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ’(ఎసిసి) పొడగించింది.
శక్తికాంత దాస్ 1980 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖలో కీలక హోదాలు నిర్వహించారు. ఆయన రెవెన్యూ శాఖ, ఆర్థిక వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఆయనను ఆర్‌బిఐ గవర్నర్‌గా నియమించారు. 2018 డిసెంబర్‌లో ఆయన బాధత తీసుకున్నారు. దానికి ముందు ఆయన 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా, భారత తరఫున జి-20 షెర్పాగా పనిచేశారు.