హైదరాబాద్: తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ అవతలి తీరమైన మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరించా తాలూక పెంటిపాక అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. పశువుల కాపరిపై పులిదాడి చేయగా ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. పెంటిపాకకు చెందిన పశువుల కాపరి సమీప అటవీ ప్రాంతంలో మేతకోసం పశువులను తీసుకోని వెళ్ళగా ఆకస్మాత్తుగా పులి దాడి చేసిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ దాడిలో దుర్గం మల్లయ్య (50) అనే పశువుల కాపరీ తీవ్రమైన గాయాలతో అక్కడిక్కడే మృత్యువాత పడగా, మరో వ్యక్తి పులి దాడి నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. వారిపైనే కాకుండ పులి పశువులపైన దాడి చేసి గాయపర్చినట్లు ఆప్రాంతానికి చెందిన ప్రజలు తెలిపారు. పెంటిపాక అటవీ ప్రాంతం తెలంగాణకు సరిహద్దు ప్రాంతం కావడంతో మహదేవహర్, పలిమెల, మహముత్తారం మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిని ఆ ప్రాంతానికి చెందిన అటవీశాఖ అధికారులు పులి లేదా చిరుత పులి దాడిచేసిందా అనే కోణంలో ఆరాతీస్తున్నారు. ఈ విషయమై స్థానిక అటవీశాఖ అధికారులను సంప్రదించగా తమకెలాంటి సమాచారం లేదని వివరించారు.