Monday, November 18, 2024

సఫారీతో లంక సమరం.. ఇరు జట్లకు కీలకమే!

- Advertisement -
- Advertisement -

షార్జా: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగే కీలక మ్యాచ్‌కు శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికీ ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడి ఒక్కో విజయాన్ని అందుకున్నాయి. ఇక సెమీస్ రేసులో నిలువాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం రెండు జట్లకు అనివార్యంగా తయారైంది. దీంతో కచ్చితంగా గెలవాల్సిన పోరుకు ఇరు జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన శ్రీలంక విజయం సాధించగా, వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా జయకేతనం ఎగుర వేసింది. రెండు జట్లు కూడా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యాయి. ఇక శనివారం జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు కూడా గెలుపే లక్షంగా పెట్టుకున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సెమీస్ చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఒకవేళ ఇందులో ఓటమి పాలైతే మాత్రం ముందుకు వెళ్లడం కష్టంగా మారుతోంది. దీంతో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని ఇరు జట్లు పట్టదలతో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా చివరి వరకు గెలుపు కోసం పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కానీ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అలవోకగా గెలిచి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకుంది. ఇక ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన శ్రీలంకకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. రెండు విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తున్న సౌతాఫ్రికాను ఓడించాలంటే శ్రీలంక అసాధారణ ఆటను కనబరచక తప్పదు. బౌలింగ్‌లో బాగానే ఉన్నా బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఓపెనర్ నిసాంకా వరుసగా రెండు మ్యాచుల్లోనూ విఫలం కావడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా బాగానే ఆడుతున్నా భారీ స్కోర్లను మాత్రం సాధించలేక పోతున్నాడు. ఈ మ్యాచ్‌లో కుశాల్ పెరీగా మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కబరచాల్సిన అవసరం ఉంది. ఒక అసలంకా కూడా జట్టుకు కీలకంగా మారాడు. బంగ్లాదేశ్‌పై భారీ ఇన్నింగ్స్‌తో అలరించిన అసలంకా కిందటి మ్యాచ్‌లో మాత్రం నిరాశ పరిచాడు. ఆస్ట్రేలియాపై 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రాజపక్స రూపంలో లంకకు మరో మెరుగైన అస్త్రం ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోతున్న రాజపక్స ఈసారి కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. అవిష్క ఫెర్నాండో కూడా తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగక తప్పదు. కెప్టెన్ శనకా ఇటు బ్యాట్‌తో అటు బంతితో రాణించాల్సి ఉంది. కరుణరత్నె కూడా రెండు విభాగాల్లో సత్తా చాటాలి. అప్పుడే ఈ మ్యాచ్‌లో శ్రీలంక భారీ స్కోరు సాధించే అవకాశాలుంటాయి. ఇక మహేశ్ తీక్షణ, చమికా కరుణరత్నె, వనిండు హసరంగా, కెప్టెన్ దాసున్ శనకా తదితరులతో లంక బౌలింగ్ బలంగా ఉంది. వీరంత సమష్టిగా రాణిస్తే ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడం లంకకు కష్టమేమీ కాదు.
సమరోత్సాహంతో..
ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించడంతో సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. దీంతో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కావడం ఖాయం. అయితే కెప్టెన్ బవుమా వరుసగా రెండు మ్యాచుల్లోనూ తక్కువ స్కోరుకే ఔట్ కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రీజా హెండ్రిక్స్, డుసెన్, ఐడెన్ మార్‌క్రమ్‌లు జోరు మీదుండడం సౌతాఫ్రికా అతి పెద్ద ఊరటగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో మార్‌క్రమ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. 26 బంతుల్లోనే అజేయంగా 51 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. హెండ్రిక్స్, డుసెన్‌లు కూడా కిందటి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ప్రెటోరియస్ తదితరులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. మరోవైపు బౌలింగ్ విభాగంలోనూ దక్షిణాఫ్రికాకు తిరుగులేదు. రబడా, నోర్జే, కేశవ్ మహారాజ్, శంసి, ప్రెటోరియస్ తదితరులతో బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు. ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

T20 World Cup 2021: SA vs SL Match today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News