గ్లాస్గో: రెండు వారాలపాటు కొనసాగే ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్26) స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఆదివారం అధికారికంగా ఆరంభమైంది. ఈ సదస్సు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు కొనసాగతుంది. ఉద్గారాల సమస్యలు ఎదుర్కొంటున్న చిన్న దేశాలకు సాయపడే విషయాన్ని కూడా ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ సదస్సులో గ్లోబల్ వార్మింగ్ ఉమ్మడి సవాలుపై దాదాపు 200 దేశాలు చర్చించనున్నాయి. గ్రీన్ గ్యాస్ ఎమిషన్స్(కాలుష్య వాయు ఉద్గారాలు), వాతావరణ మార్పు ప్రభావాలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై సోమవారం మొదలు ప్రపంచం నలుమూల దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చించనున్నారు. 2015లో కుదిరిన ప్యారీస్ వాతావరణ ఒప్పందం తర్వాత ఎటూ తేలని వాతావరణ సమస్యపై ఇక ఈ దేశాల ప్రతినిధులు తీవ్రంగా చర్చించనున్నారు. ఐక్యరాజ్యసమితి చివరి వాతావరణ సదస్సు 2019 చివర్లో జరిగింది. గ్లోబల్ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్(2.7 ఫారిన్‌హీట్) కంటే పెరగకుండా చూసే విషయంపై నాడు చర్చించారు. పారిశ్రా మిక విప్లవానికి ముందున్న వాతావరణ స్థితికి ఎలా తీసుకెళ్లాలనేది సభ్యదేశాలు చర్చించనున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని, దానిని ఎలా తగ్గించాలనే విషయాలపై 200 దేశాలు ఈ సదస్సులో చర్చించనున్నాయి.