టాటా మ్యాజిక్, ఆటోను ఢీకొట్టిన లారీ
13 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు పాత రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ లారీ ఆదివారం రాత్రి భీభత్సం సృష్టించింది. అశ్వాపురం నుంచి ప్రయాణీకులతో ఇల్లెందు వైపు వెళుతున్న టాటా మ్యాజిక్‌ను కొత్తగూడెం నుంచి ఇల్లెందు వైపు వెళుతున్న లారీ ఢీకొట్టడంతో టాటామ్యాజిక్‌లోని ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే లారీ మరో ఆటోను ఢీకొట్టడంతో ఆటో బస్సును గుద్దుకుని ఆటో రోడ్డుకు కుడివైపున ఉన్న పొదల్లోకి వెళ్లిపోగా అందులోని ప్రయాణీకులు కూడా గాయపడ్డారు. గాయపడ్డ 13మంది క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్రత్రికి తరలించారు. మరికొందరని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.
ఆటోలో ఉన్న రాంనగర్‌కు చెందిన కార్తీక్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని ప్రైవేటు ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలిస్తున్నారు. మొత్తం ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. యాకయ్య, ఐలయ్య, సిహెచ్.లక్ష్మీ, వర్ధనమ్మ, శ్రీలక్ష్మీ, భద్రయ్య, అక్షిత్, చల్లా కమలమ్మ, మల్లయ్య, చింతల వర్ష , గంజి నాగరాజు, కార్తీక్, విజయ గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో గంజినాగ రాజు పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా టాటా మ్యాజిక్ మరో ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. వాటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదకారణంగా ఎప్పుడు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కొత్తగూడెం ఇల్లెందు మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ అంజయ్య క్షతగాత్రును ఆస్పతికి తరలించి, ట్రాఫిక్ క్లియర్ చేశారు.