మన తెలంగాణ,సిటీబ్యూరో: పొగాకు రంగంలో కాంట్రాక్ట్ వ్యవసాయ ఆలోచనను ప్రభుత్వ విరమించుకోవాలని, తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన పొగాకు రైతులు రైతు సంఘాల నాయకులతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్లూ క్యూర్డ్ వర్జీనియా రైతులకు తీవ్ర నష్టం కలిగిందని, పొగాకు రంగంలో కాంట్రాక్ట్ వ్యవసాయం తీసుకరావడం నష్టాలు మరింత పెరుగుతాయని గ్రోయర్స్ అసోసియేషన్ నేతలు వెల్లడించారు. ఈసందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ కర్నాటక వర్జీనియా టొబాకో గ్రోయర్స్ నేత జవార్‌గౌడ మాట్లాడుతూ ఎఫ్‌సీవీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ మమ్ముల్ని 1984 ముందు నాటికి తీసుకవెళ్లిందన్నారు. మనం ఖచ్చితంగా ప్రస్తుత వేలం వ్యవస్దను కాపాడాల్సిన ఉందని, తమ అమ్మకాల పునరుద్దరణ కోసం కుట్రలు పన్నుతున్న విదేశీ పొగాకు బహుళజాతి సంస్దల ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎం. సుబ్బారెడ్డి, మురళిబాబు పాల్గొని కాంట్రాక్ట్ వ్యవసాయం విధానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.