Saturday, November 23, 2024

ఉపాధి హామీ బకాయిలు

- Advertisement -
- Advertisement -

Employment Guarantee Arrears

 

నైపుణ్యాలు కొరవడిన గ్రామీణ పేదలను ఆదుకోడానికి కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గల డిమాండ్ అసాధారణమైనది. కేవలం శరీర శ్రమ మీదనే ఆధారపడి బతుకుతున్న జనాభా అత్యధికంగా ఉన్న ఇండియాలో ఈ పథకానికి విశేష ఆదరణ ఉండడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. దేశంలో ప్రతి ఐదు మందిలో ఒక్కరు మాత్రమే వృత్తి నైపుణ్యం గలవారని 2020 మానవాభివృద్ధి నివేదిక వెల్లడించింది. అంటే జనాభాలో 21.2 మంది మాత్రమే నిపుణులు. ఈ విషయంలో దేశం ఎంతో వెనుకబడి ఉన్నదని ఈ చేదు వాస్తవం చాటుతున్నది. అందుచేత ప్రజలకు ఉపాధి కల్పించాలంటే తప్పనిసరిగా శారీరక శ్రమ ఆధారంగా చేసే పనులకే వారిని ఉపయోగించాలి. అందుచేతనే వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్న జనాన్ని ఇతర రంగాలకు తరలించాలన్న పాలకుల లక్షం తొందరగా నెరవేరడం లేదు. సాంకేతిక విద్యలో పట్టభద్రులవుతున్న యువతరానికి సైతం వారు చదువుకున్న సబ్జెక్టులలో తగినంత నిపుణత కొరవడుతున్నది. ఇందువల్ల అందుకు సంబంధించిన పరిశ్రమల్లో వారికి ఉద్యోగాలు లభించడం లేదు. ప్రభుత్వరంగంలో ఉద్యోగావకాశాలు సన్నగిల్లిపోయాయి.

కంప్యూటర్లు, ఇంటర్‌నెట్ వంటి ఆధునిక సౌకర్యాలు పెరిగిన తర్వాత గుమాస్తా ఉద్యోగాల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో చదువుకున్న వారు సైతం గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసుకొని బతకక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, గిరాకీ కోల్పోయిన వృత్తి కుటుంబాల వారు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లభించే పనులు చేస్తూ పొట్ట పోషించుకుంటున్నారు. కొవిడ్ కారణంగా పట్టణ ప్రాంతాల్లో పని పాట్లు మూతబడిపోయి ఉద్యోగాలు కోల్పోయిన వారు సైతం గ్రామాలకు వెళ్లి ఈ పనులు చేసుకొని బతుకుతూ వచ్చారు. పర్యవసానంగా ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా సగ భాగం మిగిలి ఉండగానే ఈ పథకం వట్టిపోయింది. దీనితో ఈ పనులు చేస్తున్న అసంఖ్యాక జనానికి, వీటి కోసం కొనుగోలు చేస్తున్న సామగ్రికి చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. డిమాండ్‌ను బట్టి పనులు కల్పించి తీరవలసిన పథకం అయినందున గిరాకీ పెరుగుతున్న కొద్దీ దీనికి కేటాయింపులు పెంచుకుంటూ పోవలసి ఉంటుంది. 202122 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 73,000 కోట్లు కేటాయించారు.

గత అక్టోబర్ 29 నాటికి ఖర్చయింది రూ. 79,810 కోట్లు. 21 రాష్ట్రాల్లో దీనికి బొత్తిగా నిధులు కరవయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అత్యంత అధ్వానమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తాజాగా ఒడిశా కూడా ఈ జాబితాలో చేరింది. తమ రాష్ట్రంలో ఈ పథకం కింద బకాయిపడిన చెల్లింపులు రూ. 1088.72 కోట్లు అని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు. ఈ సొమ్మును వెంటనే విడుదల చేయాలంటూ నవీన్ పట్నాయక్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఉపాధి హామీ పథకం కూలీలకు సకాలంలో చెల్లింపులు జరపడమనేది అది ఇస్తున్న మౌలికమైన హామీ అని, సామగ్రికి బకాయి పడిన సొమ్మును చెల్లించడం ద్వారా ఈ పథకం కింద మన్నికైన ఆస్తులు సృష్టించుకోవచ్చునని ఆయన ఆ లేఖలో వివరించారు. కొవిడ్ కాలంలో దేశమంతా లాక్‌డౌన్‌కు గురైనందున వలస కార్మికులు విశేష సంఖ్యలో తిరిగి స్వస్థలాలకు చేరుకొని ఉపాధి హామీ పనులు చేసుకున్నారని ఇందువల్ల ఈ పథకం వ్యయం బాగా పెరిగిందని వివరించారు.

నైపుణ్యాల విషయానికి వస్తే మన పొరుగునున్న నేపాల్, శ్రీలంక కూడా మన కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఆ రెండు దేశాల్లో 40 శాతం మంది కార్మికులు వృత్తి నైపుణ్యాలు కలిగి ఉన్నారు. మయన్మార్ (28.1శాతం), పాకిస్తాన్ (27.81 శాతం), బంగ్లాదేశ్ (25.81 శాతం) కూడా మనకంటే అధికంగా నిపుణులను కలిగి ఉన్నాయి. అమెరికా, జపాన్, కెనడా, తూర్పు యూరప్ దేశాల్లో 90 శాతం జనాభాకు నిపుణతలున్నాయి. జర్మనీ, స్విట్జర్లాండ్, స్వీడన్, ఫ్రాన్స్, బ్రిటన్‌లోనూ 8090 శాతం మంది నిపుణులే. యుపిఎ పాలనను పలు రకాలుగా దుయ్యబట్టి అధికారంలోకి వచ్చిన బిజెపి గత ఏడేళ్ల సొంత పాలనలో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించక తప్పడం లేదు. దానిని నిరుత్సాహపరిచే విధంగా నిధుల కేటాయింపుల్లో కోత విధిస్తున్నప్పటికీ అంతిమంగా దాని తప్పనిసరి అవసరాన్ని గుర్తించి ఆ మేరకు అదనపు కేటాయింపులు జరపవలసి వస్తున్నది. వివిధ పారిశ్రామిక వృత్తుల్లో 40 కోట్ల మంది భారతీయులకు నిపుణ శిక్షణ ఇవ్వడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం 2017లో స్కిల్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద వివిధ నైపుణ్యాలను వీరికి కల్పించి 2022 నాటికి సాధికారత కలిగిన కార్మిక శక్తిని సృష్టించాలని లక్షంగా పెట్టుకున్నది. కాని ఆచరణలో అది నత్తనే తలపిస్తున్న జాడలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News