పెట్రో ధరలు పెంచింది కొండంత… తగ్గించింది గోరంత
మూడు నెలల్లో పెరిగిన పెట్రో ధర రూ.36, డీజిల్ ధర రూ.26.50 , తగ్గింది రూ.5, రూ.10లే
మనతెలంగాణ, హైదరాబాద్: పేద, మధ్య తరగతి వర్గాల బతుకులను భారం చేస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ప్రకటించిన ఉపశమన ధరల పట్ల ఆ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం మూడు నెలల్లో పెట్రోల్‌పై రూ. 36.50, డీజిల్ పై రూ. 26 పెంచి తాజాగా ఎన్నికల షాక్ తర్వాత పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గించడం మూలంగా పేద, మధ్య తరగతి వర్గాలకు పెద్దగా ఆర్థిక ఉపశమనం ఉండదని ఆ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మూడు నెలల్లోనే రూ. 70 నుంచి పెట్రోల్, డీజిల్ రూ. 100కు మించి పెంచి ఇప్పుడు రూ. 5, 10 తగ్గించామని గొప్పలు చెప్పుకోడం తప్ప పెద్దగా ఒరిగేది లేదని వారు చెబుతున్నారు. కేంద్రం వసూలు చేసే రూ. వందను మించే పెట్రోల్, డీజిల్ రేట్లలో రూ. 42 ఆయిల్ కంపెనీలకు వెళుతాయి. కేంద్రం రూ. 31 తీసుకుంటే డీలర్ కమీషన్ రూ. 4, రాష్ట్రాలు వ్యాట్ రూపంలో రూ. 23 తీసుకుంటాయి. కేంద్రమే పన్నుల రూపంలో సింహ భాగం వాటా తీసుకొని దానిని తిరిగి జిఎస్టి నష్ట పరిహారం రూపంలో రాష్ట్రాలకు ఇవ్వకుండా, గోరంత తగ్గించి కొండంత ప్రచారం చేసుకోడం తప్ప మరొకటి కాదని భారం పడే ప్రజలు అంటున్నారు.