Friday, November 22, 2024

బీహార్‌లో కల్తీసారా కాటుకు మరో నలుగురు బలి

- Advertisement -
- Advertisement -

Bihar Hooch Tragedy: Death Toll Reaches 40

40 కి చేరుకున్న మృతుల సంఖ్య

సమస్తిపూర్/పాట్నా: బీహార్‌లో కల్తీ సారా తాగి మరో నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దీపావళినుంచి ఇప్పటివరకు నాటు సారా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 40 దరిదాపులకు చేరుకుంది. తాజా మరణాలు సమస్తిపూర్ జిల్లాలో సంభవించాయి. ఇంతకు ముందు గోపాల్ గంజ్, పశ్చిమ చంపారణ్ జిల్లాల్లో నాటు సారా తాగి కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన నలుగురు కూడా రాపౌల్ పంచాయతి పరిధిలోని గ్రామాలకు చెందిన వారని, వీరిలో ఒక ఆర్మీ జవాను, మరో బిఎస్‌ఎఫ్ జవాను కూడా ఉన్నారని సమస్తిపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మానవ్‌జీత్ సింగ్ ధిల్లాన్ చెప్పారు. అస్వస్థకు గురయిన మరో ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. వీరంతా ఒక అంత్యక్రియల కార్యక్రమానికి వెళ్లారని, అంత్యక్రియల తర్వాత వారంతా సెలవుపై స్వగ్రామానికి వచ్చిన ఆర్మీ జవాను తీసుకొచ్చిన మద్యం సేవించారని ఆయన తెలిపారు. సంఘటన స్థలంలో ఒక ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బాటిల్‌ను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ టీమ్‌ను పిలిపిస్తున్నామని ఎస్‌పి తెలిపారు. మద్యం సేవించిన మరికొందరు కూడా అస్వస్థతకు గురయినట్లు తమకు తెలిసిందని, విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు రావాలని వారి కుటుంబ సభ్యులను కోరుతున్నామని ఆయన తెలిపారు. బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం 2016లో మద్యం అమ్మకం, సేవించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News