3 గంటల 28 నిమిషాల పాటు దర్శనం
ఈ ఏడాదిలో ఇదే చివరి గ్రహణం
న్యూఢిల్లీ : నవంబరు 19 శనివారం కార్తీక పౌర్ణమి నాడు సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఆవిష్కృతం కానున్నది. శతాబ్దం లోనే ఇది సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం అని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) శనివారం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18,19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం నవంబరు 19 న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రుడు , సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి, భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి 3 గంటల 28 నిమిషాల పాటు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడ నుంది. చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం మే 26 న వైశాఖ పౌర్ణమినాడు సంపూర్ణ చంద్రగ్రహణంగా సాక్షాత్కరించింది. ఆరోజు అరుణ వర్ణంలో నిండు చంద్రుడు కనువిందు చేశాడు. దీన్నే బ్లడ్ మూన్, సూపర్‌మూన్ అని అంటారు.
భారత్‌తోపాటు మరికొన్ని దేశాల్లో ఇది కనిపిస్తుంది….
భారత్ లోని అసోం, అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. అలాగే ఉత్తర అమెరికా లోని 50 దేశాలతోపాటు మెక్సికో ప్రజలు దీన్ని పూర్తిగా చూడవచ్చు అమెరికా తూర్పు తీరంలో రాత్రిపూట చూసేవారు తెల్లవారు జామున 2 నుంచి 4 గంటల వరకు సందర్శించ వచ్చు. పశ్చిమ తీరంలో ఉన్నవారు రాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట మధ్య ఈ అద్బుతాన్ని వీక్షించవచ్చని నాసా పేర్కొంది. ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పషిఫిక్ ప్రాంతం లోని ప్రజలకు ఈ పాక్షిక చంద్ర గ్రహణం దర్శనమివ్వబోతోంది.
ఈ గ్రహణం ఫ్రాస్ట్‌మూన్ …
ఈ గ్రహణాన్ని మంచుతో కప్పబడిన చంద్రుడిగా ఫ్రాస్ట్ మూన్ అని పిలుస్తారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. శరదృతువు చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికా లోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరు పెట్టారు. భూమి యోక్క నీడతో చంద్రుడు పూర్తిగా నల్లబడడం వల్ల సంపూర్ణ చంద్ర గ్రహణలా ఇది అద్బుతమైనది కానప్పటికీ , ఈ పాక్షిక చంద్రగ్రహణం చంద్రుని ఉపరితలంలో 97 శాతం కనిపించకుండా దాచేస్తుంది. వచ్చే 80 సంవత్సరాల్లో 2021,2030 మధ్య 20 సంపూర్ణ, పాక్షిక , పెనుంబ్రల్ గ్రహణాలు ఏర్పడే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. 2001 నుంచి 2100 శతాబ్దం మధ్య అత్యంత ఈ పాక్షిక చంద్రగ్రహణమే సుదీర్ఘమైనది. 21 వ శతాబ్దంలో ఇప్పటివరకు 228 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాదికి ఇదే ఆఖరి చంద్రగ్రహణం. వచ్చే ఏడాది 2022 మే 15, 16 తేదీల్లో సంపూర్ణ చంద్రగ్రహణం (బ్లడ్‌మూన్ ) ఏర్పడనుంది.