ముంబయి: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్‌సిబి)కి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శనివారం ముంబయికి చేరుకున్నది. షారుక్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ కేసుతోపాటు మరో ఐదు కేసుల్ని ఎన్‌సిబి ఢిల్లీ విభాగానికి చెందిన సిట్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం సిట్ బృందం దక్షిణ ముంబయిలోని ఎన్‌సిబి కార్యాలయానికి చేరుకున్నది. సిట్‌కు సీనియర్ అధికారి సంజయ్‌కుమార్‌సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ‘కొన్ని కేసుల దర్యాప్తును తాము చేపట్టాం. మా దర్యాప్తును ప్రారంభిస్తున్నాం’ అని ఈ సందర్భంగా సంజయ్‌సింగ్ అన్నారు.
ఈ కేసులపై దర్యాప్తును పునఃప్రారంభిస్తారా.? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. కేసులవారీగా ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తును మొదట పరిశీలిస్తాం. ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్లాలన్నది నిర్ణయిస్తామని సింగ్ అన్నారు. డ్రగ్స్ కేసులకు జాతీయ, అంతర్జాతీయ లింక్‌లున్నందున లోతైన దర్యాప్తు జరపాల్సి ఉన్నదని ఎన్‌సిబి శుక్రవారం పేర్కొన్నది. మరోవైపు ఈ కేసులకు సంబంధించి తాను దర్యాప్తు అధికారిని కాదని, జోనల్ డైరెక్టర్‌గా పర్యవేక్షకుడిని మాత్రమేనని, ఆ బాధ్యతలో ఇప్పటికీ కొనసాగుతున్నానని వాంఖడే అనడం గమనార్హం.
వాంఖడేపైనా సిట్ దర్యాప్తు జరపాలి: మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్
తాజా పరిణామంపై ఎన్‌సిపి నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్ తన స్పందనను ట్విట్ చేశారు. సమీర్‌వాంఖడేపై వచ్చిన కిడ్నాప్, ఆర్యన్‌ఖాన్ నుంచి లంచం అడగడంలాంటి ఆరోపణలపై దర్యాప్తు జరపాలని తాను సిట్‌ను డిమాండ్ చేస్తున్నానని మాలిక్ తెలిపారు. కేంద్రం, రాష్ట్రం ఈ అంశంలో రెండు సిట్‌లు ఏర్పాటు చేశాయి. వాంఖడేకు సంబంధించిన అస్థిపంజరాలను, ఆయన ఆధ్వర్యంలోని నీచమైన ప్రైవేట్ సైన్యాన్ని ఎవరు బయటపెడ్తారో చూద్దాం అంటూ మాలిక్ ట్విట్ చేశారు. వాంఖడేపై ఇప్పటికే ఎన్‌సిబి విజిలెన్స్ దర్యాప్తును చేపట్టింది.