అధికారిక భవనంపై డ్రోన్ దాడి
తృటిలో తప్పిన ముప్పు
గాయపడ్డ అంగరక్షకులు
నెలరోజుల కల్లోల పర్యవసానం
బాగ్దాద్: ఇరాక్ ప్రధాన మంత్రి ముస్తఫా అల్ కధిమిని ఆయన నివాసంలోనే చంపేసేందుకు భారీ కుట్ర జరిగింది. పేలుడుపదార్థాలున్న డ్రోన్లతో జరిగిన ఈ దాడిలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కాపలాలో ఉండే ప్రాంతంలోని ఈ భవనాన్ని ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ వచ్చి ఢీకొంది. పలు సాయుధ డ్రోన్ల ప్రయోగం జరిగిందని, అయితే ఒక్క డ్రోన్ వచ్చి ఢీకొన్న ఘటనలో అక్కడున్న ప్రధాని అంగరక్షకులు తీవ్రంగా గాయపడ్డారని, ప్రధాని సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. దేశంలో గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఇరాన్ మద్దతున్న తిరుగుబాటు దళం అంగీకరించడం లేదు. దీనితో ఇరాక్‌లో ఇటీవలి కాలంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నివాసంపై దాడి జరిగి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అయితే ఇంతవరకూ ఏ సంస్థ కూడా దాడికి బాధ్యత వహించలేదు. అయితే ఇది ఫక్తు ఉగ్రదాడి బాపతుగా ఉందని అమెరికా అధికారిక స్పందన వెలువరించింది.
గ్రీన్ జోన్ పరిధిలో రెండు డ్రోన్లతో దాడిని తీవ్ర ఘటనగా ఇరాక్ పరిగణించింది. తాను క్షేమంగా ఉన్నానని, దేవుడి దయవల్ల తన ప్రజలతో తిరిగి ఉండే అవకాశం దక్కిందని ఆ తరువాత ప్రధాని తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఇరాక్ క్షేమం కోసం అంతా ప్రశాంతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. తరువాత ఆయన ఇరాక్ టీవీ ద్వారా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ఎంతో నింపాదిగా ఓ బల్ల వెనుక సీటులో కూర్చుని తెల్లటి షర్టుతో ఉన్న ఆయన డ్రోను దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు . ‘పిరికిపందల చేష్ట అయిన రాకెట్ డ్రోన్ల దాడులతో సొంత ప్రాంతాలు నెలకొనవు. భవిష్యత్తు ఏర్పడదు అని వ్యాఖ్యానించారు. డ్రోన్ల దాడి సమయంలో తెల్లవారుజామునే బాగ్దాదీలకు విఐపిలు ఉండే ప్రాంతం నుంచి భీకరపేలుళ్లు చప్పుళ్లు విన్పించాయి. విదేశీ దౌత్యప్రతినిధులు ఉన్నతాధికారులు నివాసం ఉండే గ్రీన్ జోన్ పరిధిలోనే కాల్పులు జరిగినట్లు తెలిసిందని స్థానికులు తెలిపారు. పేలుడు పదార్థాలతో కూడా డ్రోన్ ప్రధాని భవనాన్ని పేల్చేందుకు దూసుకువచ్చిందని అధికారులు తెలిపారు.