ముంబై : మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను జుడిషియల్ కస్టడీకి పంపించాలనే ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ముంబై హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ నెల 12వ తేదీ వరకూ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీకి అనుమతిని వెలువరించింది. దేశ్‌ముఖ్‌ను జుడిషియల్ కస్టడీకి పంపించాలనే న్యాయమూర్తి ఆదేశాలు సరికావని ఇడి తెలియచేసుకుంది. దేశ్‌ముఖ్‌ను జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయాలనే ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు తమ సంస్థ ద్వారా ఈ కేసులో సరైన విచారణకు ఉన్న అవకాశాలను దెబ్బతీసినట్లు అయిందని తెలియచేసుకుంది.
ఇతరత్రా కస్టడీకి తరలిస్తే కేసుకు సంబంధించి తీవ్రస్థాయి పరిణామాలు ఉంటాయని వాపోయింది. తాము దేశ్‌ముఖ్‌ను ఐదురోజులు విచారించాల్సి ఉందని, అయితే ఈ మధ్యలో రెండు రోజులు దీపావళి సెలవులు వచ్చాయని, విచారణ తంతు పూర్తికాలేదని ఇడి తెలియచేసుకుంది. దీనితో ఏకీభవించిన హైకోర్టు దేశ్‌ముఖ్‌ను ఇడి కస్టడీకి అప్పగించడం సబబు అని తెలిపింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెల్లనేరదని స్పష్టం చేసింది. ఈ నెల 1వ తేదీన మనీలాండరింగ్ కేసులు దేశ్‌ముఖ్ అరెస్టు అయ్యారు.