Saturday, November 23, 2024

మెట్రోకు ఆదాయం కురిపిస్తున్న సువర్ణ ఆఫర్

- Advertisement -
- Advertisement -

కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్న నగర జనం
పక్షం రోజుల్లో సుమారు లక్ష మంది కొనుగోలు
గతేడాదికంటే ఈసారి ఆఫర్ వైపు ప్రయాణికుల క్యూ
ఈనెలాఖరు వరకు కార్డుల కొనుగోలు పెరగవచ్చని భావిస్తున్న మెట్రో

More income with Metro offers
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరవాసులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్న మెట్రో ఇటీవల ప్రకటించిన సువర్ణ ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి ఆశించిన స్దాయిలో స్పందన వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత నెల 18వ తేదీ నుంచి ప్రారంభించి 15 జనవరి 2022వరకు అందుబాటులోకి తేవడంతో దీనిని నిత్యం వ్యాపార, సొంత పనుల మీద తిరిగే వారు ఉపయోగించుకుంటున్నారు. దీపావళి పండగవరకు సుమారు లక్షలమందికి పైగా సువర్ణ ఆఫర్ కార్డులను కొనగోలు చేసినట్లు, ఇంకా కూడా తీసుకునే వారి సంఖ్య పెరగవచ్చని మెట్రో సిబ్బంది అంచనా వేస్తున్నారు. గత వారం రోజుల నుంచి మెట్రోస్టేషన్ల వద్ద పార్కింగ్ నిండిపోతుందని, రోజుకు ఒక స్టేషన వద్ద 2500లకు ద్విచక్ర వాహానాలు పార్కింగ్ చేసి పలు ప్రాంతాలకు వెళ్లుతున్నట్లు చెబుతున్నారు. కోవిడ్ రెండు వేవ్‌లలో భారీ నష్టాలు చవిచూసిన మెట్రో కొత్త పథకాలు తీసుకరావడంతో నగర ప్రజలు మెట్రో ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.

గత రెండు నెలల నుంచి మెట్రో రైల్ సేవలు పొడిగించి రాత్రి 11.15 గంటల వరకు చివరి రైల్ నడిపే విధంగా వెసులుబాటు కల్పించడంతో ప్రయాణీకులు సంఖ్య రోజుకు 1.50లక్షల వరకు చేరుగా, నూతన పథకాలతో మరింత ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకు 2.80లక్షల మంది చేరుకునేలా చేస్తామని, ప్రయాణికులు సులువుగా ఉండే విధానాలు తీసుకొస్తే తమ లక్షం చేరుకుంటామని వెల్లడిస్తున్నారు. మెట్రో ప్రయాణికులు తమ ప్రయాణ అవసరాలకు తగినట్లుగా ఏదైనా ఫేర్‌తో 30 ట్రిప్పులను కేవలం 20 ట్రిప్పుల ధర చెల్లించి 45 రోజుల పాటు తిరగవచ్చని మెట్రో స్మార్ట్ కార్డ్‌పై మాత్రమే వర్తిస్తుందని చెప్పారు.

అదే విధంగా ఆకర్షనీయమైన బహుమతులను ప్రతి నెల గెలుచుకునే అవకాశం కల్పిస్తూ ప్రతి నెలా ఐదుగురు విజేతలను లక్కీడ్రా సిఎస్‌సీ కార్డు వినియోగదారుల నుంచి ఎంపిక చేస్తామని మెట్రో ఉన్నతాదికారులు వెల్లడిస్తున్నారు. వీరు ఓక్యాలెండర్ నెలలో కనీసం 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ సిఎస్‌సీ (కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డు)లను టీ సవారీ, మెట్రో స్టేషన్ల వద్ద నమోదు చేసుకోవాల్సి సూచిస్తున్నారు. అదే విధంగా కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తామని, స్టేషన్ల వద్ద మాస్కులు, శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నట్లు, వ్యక్తుల మధ్య భౌతికదూరం పాటించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News