Saturday, November 23, 2024

తెల్ల బంగారమే

- Advertisement -
- Advertisement -

పత్తి పంట ఒకేసారి కోతకు వచ్చే వంగడాల సాగుకు సన్నద్ధం
వచ్చే ఏడాది 60వేల ఎకరాల్లో కొత్తరకం పత్తి : సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: తెల్ల బంగారం ఎగుమతులతో తెలంగాణ వ్యవసాయ రంగం కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలకు వ్యాపిస్తున్నాయి. ప్రపంచంలోని పత్తి పండించేదేశాల్లో మన దేశం ప్రధమ స్థానంలో ఉండగా, పత్తి పంట ఎగుమతుల్లో రెండవ స్థానంలోవుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వివిధ పథకాల అమలు ద్వారా అందిస్తున్న ప్రోత్సాహంతో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అయితే పత్తిపంట సాగులో కోత ఖర్చులే అధికంగా ఉండటంతో ప్రభుత్వం పత్తిసాగులో వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టబోతోంది. పత్తి సాగులో పలు దఫాలుగా కాకుండా పంటంతా ఒకేసారి కోతకు వచ్చే నూతన వంగడాలపై దృష్టి సారించింది. ఇప్పటికే యూరఫ్ దేశాల్లో ఈ రకం పత్తి వంగడం సాగులో ఉంది. ఈ కోత్తరకం పత్తిని తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మూడున్నర వేల ఎకరాల్లో ఈ రకం పత్తి విత్తనం కోసం పంట సాగులో వుంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 60వేల ఎకరాల్లో కొత్త రకం పత్తి వంగడాన్ని సాగులోకి తీసుకురానున్నట్టు ప్రకటించి ముఖ్యమంత్రి కెసిర్ తెలంగాణ రైతాంగానికి శుభవార్త అందించారు. ఇప్పటికే తెలంగాణలో పండించిన పత్తి పంటకు నాణ్యతా పరంగా అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం పత్తికి ప్రకటించిన కనీస మద్ధతు ధరకూడా రైతులకు ఆశాజనకంగానే ఉంది.

అంతర్జాతీయంగా పత్తికి పెరుగుతున్న డిమాండ్ నేపధ్యంలో పత్తి పంటకు రాష్ట్రంలో కూడా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కనీస మద్ధతు ధర కంటే అదనంగా మూడు వేల రూపాయలు లభిస్తోంది. క్వింటాలుకు 8వేల నుంచి 9వేల రూపాయల దాకా ధర పలుకుతోంది. ఈ నేపధ్యంలో ఈ సారి పత్తి సాగు దిశగా రైతులు భారీగా మొగ్గు చూపే అవకాశాలు వున్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది రాష్ట్రంలో పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 70లక్షల ఎకరాలు అని వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళిక రూపొందించుకోగా రైతులు పత్తి సాగుపట్ల అంతగా ఆసక్తి చూపలేదు. పత్తి సాగు అదను ముగిసే సరికి రాష్ట్రంలో 50లక్షల ఎకరాలకు మించలేదు. రైతులు వరిసాగు మోజులో పడటంతో పత్తిసాగు అంచనా విస్తీర్ణంలో 72శాతం మాత్రమేసాగులోకి వచ్చింది. గత ఏడాది రాష్ట్రంలో పత్తిసాగు సాధారణ విస్తీర్ణం 44లక్షల ఎకరాలకు అంచనా వేసుకోగా, ఏకంగా 60.22లక్షల ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని పత్తిసాగు ప్రణాళికను పక్కాగా రూపొందించేందుకు చర్యలు తీసుకొంది. రాష్ట్రంలో పత్తిసాగుకు పది జిల్లాల్లోనే అధికంగా వుంటోంది. ఏళ్ల తరబడి రైతులు ఈ జిల్లాల్లోనే అధికంగా ఈ పంట సాగుకు అలవాటు పడిపోయారు. గత ఏడాది పత్తి సాగు జిల్లాలను పరిశీలిస్తే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 7.29లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. తర్వాత స్థానంలో నాగరకర్నూల్‌లో 4.56లక్షలు, అదిలాబాద్ జిల్లాలో 4.23లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. నిర్మల్‌లో 3.39లక్షలు సాగులోకి వచ్చింది.రంగారెడ్డి, వికారబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, గద్వాల, ఖమ్మం, తదితర జిల్లాల్లో ఒక్కోజిల్లాలో రెండు నుంచి రెండున్నర లక్షల ఎకరాల్లో పత్తి సాగువుతోంది. మిగిలిని జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల్లోపే పత్తి సాగులోఉంది.
సిఎం వ్యూహం ఫలిస్తే కోటి ఎకరాలకు పత్తి:
ఒకే సారి పంటకోతకు వచ్చే కొత్తరకం పత్తి వంగడాల సాగులో ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహం ఫలిస్తే తెలంగాణ రాష్ట్రంలో పత్తిసాగు కోటి ఎకరాలకు చేరుకునే అవకాశాలు దగ్గర్లోనే ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో సంకర రకం పత్తి వంగడాలే అధికంగా సాగులో ఉన్నాయి. వర్షాధారంగా నరసింహ, శ్రీరామ, డబ్యుజిటివి రకాలు అధికంగా సాగు చేస్తున్నారు. సాధారణంగా పత్తి సాగు కాల వ్యవధి 78 నెలలు పడుతుంది. పత్తి పూతకు వచ్చాక నాలుగైదు దపాలుగా పంట కోతకు వస్తోంది. దీంతో పత్తి కోత కూలీ ఖర్చులు అధికమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సిఎం కెసిఆర్ ప్రకటించిన ఒకేసారి కొతకు వచ్చే పత్తివంగడం సాగులోకి తెచ్చుకుంటే రైతులకు పత్తి కోత కూలీ ఖర్చులు భారీగా మిగిలిపోనున్నయి. ఈ రకం పత్తికి మంచి డిమాండ్ కూడ లభించనుంది.

KCR Says cultivate cotton instead of paddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News