మన తెలంగాణ/ కొత్తగూడెం: ప్రశాంతంగా తమ బ్యారక్‌లో నిద్రపోతున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లపై తోటి జవాన్ ఉన్మాదంతో తుపాకీ తీసుకుని రెచ్చిపోయి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా చికిత్స పొందుతూ మరో జవాన్ మృతిచెందారు. ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుఝామున సుమారు 3గంటల ప్రాంతంలో సి50 బెటాలియన్‌లో చోటుచేసుకుంది. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా లింగ పల్లిలోని మర్రిగూడె పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో మొత్తం ఏడుగురిపై మరో జవాన్ రీతీష్‌రంజన్ తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో జిడి ధన్‌జి, రజీబ్‌మండల్, డిజి రాజమణి అనే జవాన్లు అక్కడికక్కడే మృతి చెందా రు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని ప్రత్యేక హెలికాప్టర్ సంఘటనా స్థలం నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ మరో జవాన్ ధర్మేంద్ర కేఆర్ అనే జవాన్ మృతిచెందగా ధనుంజయ్ కేఆర్ కుమార్, ధర్మాత్మా కుమార్, మలయరంజన్‌లు తీవ్రంగా శరీరంలో బుల్లెట్లు దిగి గాయపడ్డారు. కాల్పులకు తెగబడ్డ జవాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
భద్రాచలంలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. సెలవుల విషయంలో అంతకు ముందు జరిగిన గొడవే ఈకాల్పులకు కారణమని భావిస్తున్నా రు. దాదాపు ఇళ్లకు దూరంగా ఆరునెలల పాటు ఒకే చోట ఉండటం, ఏ విధమైన వేరే వ్యాపకం లేకపోవటంతో తరచూ చత్తీస్‌గఢ్‌లోని బెటాలియన్‌లో ఈ పరిస్థితి తలెత్తుతుంది. దీనివల్ల జవాన్లు కాల్పులకు తెగబడుతున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలాసార్లు చోటు చేసుకున్నారు. కాగా సంఘటన స్థలాన్ని సోమవారం బస్తర్ రేంజ్ డిఐజి సుందర్‌రాజ్, సుక్మా ఎస్పీ సందర్శించారు. మిగతా జవాన్లకు ధైర్యం చెప్పారు. జవాన్ కాల్పులకు ఎందుకు తెగించాడనే విషయం విచారణ జరుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జవాన్లపై ఇలా కాల్పులు జరిగి నలుగురు జవాన్లు మృతిచెందటం పట్ల పలువు రు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
4 Jawans shot dead by Colleague in Chhattisgarh