చెన్నై: తమిళనాడులో వానల కారణంగా నవంబర్ 10,11తేదీల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంతేకాక సహాయక చర్యలు చేపట్టేందుకుగాను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డిఆర్‌ఎఫ్)కు సంబంధించిన 13 బృందాలను రంగంలోకి దించారు. అదనపు సాయం అందించేందుకు వీలుగా మరో మూడు బృందాలను రిజర్వులో ఉంచారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం త్వరలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల తమిళనాడులో రాగల రోజుల్లో పెద్ద ఎత్తున వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెన్నైలో మంగళవారం తెలిపింది. త్వరలో చెన్నై, కాంచీపురం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, కడలూర్, విల్లూపురం, చెంగల్పట్టు, కల్లకురుచి, మయిలాడుతురై, నాగపట్నం, తనియవూర్, తిరువరూర్, పుదుకోటై, శివగంగై, రామనాతపురం, సేలం, తిరుచిరాపల్లి, అరియలూర్, పెరంబలూర్, మదురై, తిరువల్లూర్ జిల్లాలో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా తమిళనాడు తొమ్మిది జిల్లాల్లో ముందస్తు చర్యగా స్కూళ్లు, కాలేజ్‌లకు రెండు రోజులు (నవంబర్ 10,11 తేదీల్లో) సెలవు ప్రకటించారు.