ముంబై: టీమిండియాకు ఆడాలన్నది తన చిన్ననాటి కల అని, అది నెరవేరనుండడంతో ఆనందానికి అంతులేకుండా పోయిందని యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నాడు. త్వరలో సొంతగ్డపై న్యూజిలాండ్‌తో భారత్ టి20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో ఆడే టీమిండియాలో యువ ఆటగాడు వెంకటేశ్ చోటు సంపాదించిన విషయం తెలిసిందే. ఇక జాతీయ జట్టుకు ఎంపిక కావడంపై అయ్యర్ స్పందించాడు. భారత్ జెర్సీ ధరించాలనేది తన చిరకాల వాంఛ అని, అది ఇంత త్వరగా నెరవేరనుండడాన్ని ఇప్పటికీ నమ్మలేక పోతున్నానన్నాడు. ఇక అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీమిండియాలో స్థానాన్ని శాశ్వతం చేసుకునేందుకు ప్రయత్నిస్తానన్నాడు. ఐపిఎల్‌లో ఆడడం తనకు కలిసి వచ్చే అంశమన్నాడు. అంతేగాక దేశవాళి క్రికెట్లో కూడా నిలకడైన ప్రదర్శన చేస్తున్నానని, దీంతో కివీస్ సిరీస్‌లో సత్తా చాటడం ఖాయమన్నాడు. బిసిసిఐ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని, జట్టుకు అండగా నిలుస్తానని అయ్యర్ స్పష్టం చేశాడు. ఇక ఇటీవల ముగిసిన ఐపిఎల్ రెండో మ్యాచుల్లో కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహించిన అయ్యర్ 10 మ్యాచుల్లోనే 370 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో అతనికి టీమిండియాలో చోటు దక్కింది.
గర్వంగా భావిస్తున్నా…
న్యూజిలాండ్‌తో ట్వంటీ20 సిరీస్‌కు టీమిండియాలో చోటు దక్కడంపై యువ ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇంత త్వరగా భారత్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నాడు. ఇక తనపై ఎంతో నమ్మకంతో టీమిండియాకు ఎంపిక చేశారని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తన ముందున్న ఏకైక లక్షమని స్పష్టం చేశాడు. కివీస్‌పై మెరుగైన ప్రదర్శన త్వారా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానన్నాడు. ఇదిలావుండగా అవేశ్ ఖాన్‌కు టీమిండియాలో చోటు దక్కడంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇంటి పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇక అవేశ్ ఖాన్‌ను ఇరుగు పొరుగు వారు కూడా అభినందనలతో ముంచెత్తారు.
My dream come true to select India: Venkatesh Iyer