దొంగతనం ఆరోపణతో గిరిజన యువకుడిని స్పృహ కోల్పోయేలా
చితకబాదిన పోలీసులు, తండావాసుల నిరసనాగ్రహంతో
విచారణకు ఆదేశించిన ఎస్పి
మనతెలంగాణ/(సూర్యాపేట)హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు(ఎస్)మండల పరిధిలోని రామోజీతాండాలో గురువారం నాడు జై భీమ్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. గిరిజన యువకుడిని దొంగతనం ఆరోపణల మేరకు పోలీసులు చితకబాదడంతో 200 మంది ఆందోళన కారులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టిన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..సూర్యాపేట జిల్లా ఆ త్మకూరు(ఎస్) మండలం రామోజీ తండాకు చెందిన వీరశేఖర్ తన సోదరునితో కలిసి బుధవారం నాడు పొలం పనికివెళ్లాడు.
ఈక్రమంలో పొలంలో పనిచేసుకుంటున్న వీరశేఖర్‌ను ఆత్మకూరు మండలం ఏపూరు గ్రామంలో ఈనెల 5వ తేదీన జరిగిన దొంగతనంతో సంబంధం ఉందంటూ పోలీస్‌స్టేషన్‌కు తరలించి బుధవారం ఉదయం నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు విచారణ పేరుతో చితకబాదారు. ఈక్రమంలో వీరశేఖర్ కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8 గంటల సమయంలో తమకు అప్పగించాలని కోరారు. దీంతో ఇంకా విచారణ సాగుతోందని పంపడం కుదరదని పోలీసులు తేల్చిచెప్పారు. కాగా బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో వీరశేఖర్ స్పృహ కోల్పోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. పోలీసుల దెబ్బలకు ఆచేతనంగా పడిఉన్న వీరశేఖర్‌ను ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు గురువారం ఉదయం పోలీసు స్టేషన్ ముందు 200 మందితో ఆందోళన చేపట్టారు. వీరశేఖర్‌ను చోరీ కేసులో నిందితుడిగా కేసు నమోదు చేయడంతో పాటు విచారణ పేరిట పోలీసులు చితకబాదినట్లు ఆందోళన కారులు ఆరోపించారు.
ఠాణా ఎదుట గంటన్నర పాటు ఆందోళన..
పోలీసుల దెబ్బలకు తీవ్ర అస్వస్థతకు గురైన వీరశేఖర్‌ను చూసిన గిరిజనులు కోపం ఆపుకోలేక 200 మంది గిరిజనులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగి పోలీసులపై ఒక దశలో ఠాణాపై దాడికి యత్నించారు. సుమారు గంటన్నర ఆందోళన చేసి ఎస్ఐ ని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు.అదేవిధంగా జిల్లా ఎస్పి కార్యాలయం ముందు ఆందోళన చేసేందుకు వెళ్లారు. ఈక్రమంలో కొందరు పోలీసులు బాధితుడు వీరశేఖర్‌ను వైద్య సేవల నిమిత్తం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. మరికొందరు ఎస్పి కార్యాలయం వద్దకు వెళ్తుండగా రూరల్ పోలీసులు కుడకుడ కాల్వ వద్ద ఆందోళన కారులను అడ్డుకున్నారు. మీడియాకు సమాచారం చేరడంతో అక్కడి చేరుకున్న మీడియాను చూసి పోలీసులు అడ్డుతప్పుకున్నారు. కొద్ది సేపు ఏరియా ఆసుపత్రి ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వీరశేఖర్‌ను కొట్టిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రూరల్ సిఐ విఠల్‌రెడ్డి ఆత్మకూర్ పోలీసు స్టేషన్‌కు చేరుకొని గిరిజన ఆందోళన కారులను పిలిపించి మాట్లాడారు. ఈక్రమంలో బాధితుడికి ప్రైవేటు వైద్యం చేయించడంతో పాటు ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఎస్పి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు శాంతించారు.
సిసి ఫుటేజీ ఆధారంగా విచారణ
ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలో విద్యుత్తు మోటార్లు, వైర్లు ధాన్యం బస్తాలు, ట్రాక్టర్లలో డిజిల్, వ్యవసాయ పైపులు తదితర వరుస చోరీలపై అందిన ఫిర్యాదులపై పోలీసులు సిసి కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. ఆ దృశ్యాల్లో రామోజీ తండాకు చెందిన ధరావత్ నవీన్ కనిపించాడు. అతన్ని దుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. నవీన్ ఇచ్చిన సమాచారంతో మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారిని సైతం పోలీసులు చితకబాదారు. సిసి ఫుటేజీలో వీరశేఖర్ కనిపించాడని, అందుకే విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు తరలించామని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా పోలీసుల చిత్ర హింసనలకు తాళలేక వీరశేఖర్ స్పృహ కోల్పోయాడు. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు వెంటనే వీర శేఖర్‌ను తీసుకువెళ్లాలని బుధవారం అర్థరాత్రి 12 గంటలకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సృహతప్పి పడిపోయి ఉన్న వీరశేఖర్‌ను చూసి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. తండా వాసులంతా స్టేషన్ ముందుకు చేరుకుని ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సీన్ మార్చిన పోలీసులు
పోలీసుల దెబ్బలకు స్పృహ తప్పిన వీరశేఖర్‌ను చేతులపై మోసుకొచ్చి తండావాసులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన కారుల సంఖ్య పెరిగిపోతుండటంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు సీన్‌ను ఆస్పత్రికి మార్చేశారు. వెంటనే బాధితుడు వీరశేఖర్‌ను వైద్య సేవల పేరిట సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనను నిరసిస్తూ ఎస్పి కార్యాలయం ఎదుట బైఠాయించేందుకు సూర్యాపేట వెళ్తున్న తండావాసులను చివ్వెంల మండలం కుడకుడలోని మూసీ కాల్వ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తండా వాసులు అక్కడే రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నిందితులపై కేసు లేకుండా చూస్తామని సూర్యాపేట రూరల్ సిఐ, విఠల్‌రెడ్డి, డిఎస్పి మోహన్ కుమార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా ఆందోళన కారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, బాధితుడు వీరశేఖర్‌ను చితకబాదిన పోలీసుల తీరుపై పోలీసు బాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : ఎస్పి రాజేంద్ర ప్రసాద్
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్)లో గిరిజన యువకుడు వీరశేఖర్‌ను చితకబాదిన ఘటనపై విచారణ చేపట్టిన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పిరాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, గిరిజన యువకుడు వీరశేఖర్‌ను చితకబాదిన విషయంపై డిఎస్పి స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమిస్తున్నామని ఎస్పి తెలియజేశారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు.