పోలీసు అకాడమీ పరేడ్‌లో అజిత్ ధోవల్
హైదరాబాద్ : దేశ సరిహద్దుల నిర్వహణకు సంబంధించి పోలీసు బలగాల పాత్ర గణనీయం అని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ , బంగ్లాదేశ్‌ల వెంబడి మనకు విస్తారితమైన 15000 కిలోమీటర్ల పైబడి సరిహద్దు ఉందని , దేశ భద్రతకు కీలకమైన సరిహద్దుల పరిరక్షణ విషయంలో పోలీసు శాఖ ఎల్లవేళలా గురుతర ఇతోధిక పాత్ర పోషిస్తోందని కితాబు ఇచ్చారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో శుక్రవారం జరిగిన ఐపిఎస్ ప్రోబేషనర్ల 73వ బ్యాచ్ కవాతు నేపథ్యంలో అజిత్ మాట్లాడారు. భద్రతాపరమైన కీలక అంశాలు ముడివడి ఉన్న దేశ సరిహద్దుల భద్రత అత్యంత ప్రధానమైన విషయం అని, ఇందులో పోలీసు విభాగం ప్రధాన పాత్ర ముఖ్యమన్నారు. భారతదేశ సర్వసత్తాకత సముద్ర తీర కోస్తా ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌ల నుంచి సరిహద్దులలోని ఠాణాల వరకూ విస్తరించుకుని ఉందన్నారు.
పంజాబ్‌లో బిఎస్‌ఎఫ్ అధికార పరిధి విస్తరణను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం వెలువరించిన నేపథ్యంలో ఇక్కడకు వచ్చిన అజిత్ ఈ కార్యక్రమంలో పోలీసు బలగాలను ప్రశంసించారు. దేశంలోని 32 లక్షల చదరపు కిలోమీటర్ల అణువణువూ భూభాగపు శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసు దళాలపై ఉందన్నారు. ఇందులో కేవలం సరిహద్దులే కాకుండా దేశ భూభాగం అంతా ప్రస్తావనకు వస్తుందన్నారు. ప్రొబేషనర్లు ఇక్కడ శిక్షణ పొందడం, రాణించడంతోనే సరిపోదని , ఈ యువ ఐపిఎస్ అధికారులు తమకు అందిన సరైన శిక్షణను సమర్థతగా విస్తరించుకోవల్సి ఉంటుంది. దేశ సరిహద్దులలోని వేర్వేరు ప్రాంతాలలో విభిన్నంగా ఉన్న క్లిష్టతలను పోలీసు బలగాలలో చేరినీ అధికారులు తమ శిక్షణా సామర్థాల వినియోగం ద్వారా ఛేదించాల్సి ఉంటుందన్నారు. పాకిస్థాన్, చైనా, మయన్మార్ ఈ విధంగా పలు సరిహద్దులలో ఒకో విధమైన క్లిష్టతలు ఉంటాయని, పలు రకాల భద్రతా సమస్యలను ఎదుర్కొవల్సి ఉంటుందన్నారు. వీటిని సరైన విధంగా నిర్వహించే బాధ్యత అక్కడ విధులలో ఉన్న పోలీసులు, కేంద్రీయ పోలీసు సంస్థలపై ఉంటుందన్నారు.
యుద్ధాల వల్ల ఏ దేశం ఏదీ సాధించలేదని, వీటితో ఏ దేశం కూడా తన రాజకీయ లేదా సైనిక లక్షాలను పూర్తి స్థాయిలో దక్కించుకోలేదు. పైగా వీటితో అయ్యే భారం అంతా ఇంతాకాదన్నారు. పైగా ఫలితం ఏమిటనేది తెలియకుండా ఉంటుంది. అన్నింటికి మించి యుద్ధ పిపాస చివరికి సభ్య సమాజాన్ని దెబ్బతీస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రజల పాలిటి విద్రోహచర్యగా పరిణమిస్తుందని విశ్లేషించారు. విభజనరేఖలకు దారితీస్తుంది. చిక్కులు తెచ్చిపెడుతుంది. చివరికి దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఈ సందర్భంగా అజిత్ ధోవల్ పరోక్షంగా చైనా, పాకిస్థాన్‌లపై విమర్శలు గుప్పించారు. అంతర్గత భద్రతతోనే ఏ దేశం అయినా రాణిస్తుంది. లేకపోతే ఏ దేశం గొప్ప దేశం కాలేదు. ఘనతను చాటుకోలేదని స్పష్టం చేశారు. అంతర్గత భద్రతతోనే ప్రజలు ప్రగతి చెందుతారు. సరిహద్దులలో భద్రత ఉంటేనే ప్రగతిసరైన పథంగా సాగుతుందని తెలిపారు. దేశంలో 21 లక్షల మంది పోలీసు బలగం ఉందని, వీరిలో విధి నిర్వహణలో ఇప్పటివరకూ 35,480 మంది ప్రాణాలు కోల్పోయి బలి అయ్యారని చెప్పారు. భద్రతకు పాటుపడుతూ నిర్వర్తించిన బాధ్యతలతో ఇప్పటివరకూ 40 మంది ఐపిఎస్ అధికారులు అమరులు అయ్యారని వీరిని మనం అంతా సంస్మరించుకోవడం దేశం పట్ల మన బాధ్యతను చాటుతుందన్నారు.