ఆర్మీ కల్నల్ కుటుంబం సహా ఏడుగురు మృతి
ప్రధాని, రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి
గౌహతి: మణిపూర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కమాండింగ్ అధికారి, ఆయన కుటుంబం సహా నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్ సరిహద్దుల్లోని చురాచంద్‌పూర్ జిల్లా సింఘత్ సమీపంలో శనివారం ఉదయం 10గంటల సమయంలో ఈ దాడి జరిగింది. అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ వెళ్తుండగా ముష్కరులు కాల్పులు, బాంబుదాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో అస్సాం రైఫిల్స్ కమాండింగ్ అధికారి కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య అనూజ, కుమారుడు అబీర్‌తో పాటుగా తక్షణ సహాయ విభాగానికి చెందిన నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జవాన్లు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పారా మిలిటరీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు ముష్కరుల కోసం గాలింపు చేపట్టారు. ఘటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. దోషులను వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షించి తీరుతామన్నారు. విప్లవ్ దేవ్ సెలవు ముగించుకొని యూనిట్‌లో చేరేందుకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడికితామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా ప్రకటించుకోలేదు కానీ మణిపూర్‌కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎ) హస్తం ఉండవచ్చని భావిస్తున్నారు. మణిపూర్‌లో ఇటీవలి కాలంలో మిలిటెంట్లు ఇంత పెద్ద దాడికి పాల్పడడం ఇదే మొదటి సారి. దాడి జరిగిన ప్రాంతం చాలా మారుమూల ప్రాంతం కావడం గమనార్హం.
ప్రధాని, రాజ్‌నాథ్ ఖండన
కాగా మణిపూర్‌లో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించిన ఆయన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి త్యాగాలను ఎప్పటికీ మరువ లేమని ప్రధాని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.అస్సాం రైఫిల్స్‌పై దాడిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దాడి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. దేశం ఐదుగురు వీర సైనికులను కోల్పోయిందన్నారు. వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని కాపాడలేదని మణిపూర్ ఘటన మరోసారి రుజువు చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. హిందీలో చేసిన ఒక ట్వీట్‌లో ఆయన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, కాంగ్రెస్ నేత జై రాం రమేష్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఈఘటనపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.