26 మంది నక్సలైట్లు మృతి?
సి60 కమాండో పోలీసు చర్య
గంటల తరబడి ఎదురుకాల్పులు
ముగ్గురు పోలీసులకు గాయాలు
నాగ్‌పూర్‌లో చికిత్సకు తరలింపు
నాగ్‌పూర్ /ముంబై : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అడవులలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం ఉదయం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో 26 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఈ విషయాన్ని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ముంబైకి 920 కిలోమీటర్ల దూరంలో ఉండే కొట్గూల్‌గ్యారాపట్టి అటవీ ప్రాంతంలోని ధనోరా వద్ద ఘటన జరిగింది. మర్దిన్‌టోలా గ్రామం వద్ద ఘటన జరిగింది. ఘటనలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ సంచారం వార్తలు అందడంతో పోలీసు బృందాలు అటుగా తనిఖీలకు వచ్చాయి. ఈ దశలోనే పరస్పర కాల్పులు జరిగాయని, కనీసం నలుగురు నక్సలైట్లు మృతి చెంది ఉంటారని భావిస్తున్నామని ఘటన తొలి దశలో ఓ అధికారి విలేకరులకు తెలిపారు. చాలా సేపటివరకూ ఎన్‌కౌంటర్ జరిగిందని, ఈ ప్రాంతంలో ఆ తరువాతి గాలింపు చర్యలతో ఎన్‌కౌంటర్‌లో ఎంత మంది చనిపొయ్యారనేది ఖచ్చితంగా నిర్థారణ అవుతుందని వివరించారు. మృతులలో కొందరు మహిళా నక్సల్స్ కూడా తెలుస్తోందన్నారు.
తెల్లవారుజామున ఆరున్నర ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయని, డజన్ మందికి పైగా నక్సలైట్లతో చాలా సేపటివరకూ ఘర్షణ జరిగిందని గత సంబంధిత ఘటనపై జిల్లా ఎస్‌పి అంకిత్ గోయల్ తెలిపారు. ఇక్కడ మావోయిస్టుల ఏరివేత చర్యలలో పాల్గొంటున్న సి 60 గడ్చిరోలి పోలీసుల కమాండోల దళం నక్సల్స్‌ను దెబ్బతీసిందని, గంటల తరబడి సాగిన ఎన్‌కౌంటర్ జరిగింది. వెనువెంటనే పూర్తి స్థాయి వివరాలను తెలియచేయలేమని ఎస్‌పి చెప్పారు. దట్టమైన అడవులలో ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో కొంత మేరకు ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ నక్సల్స్ ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం నుంచి గడ్చిరోలి ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం అందడంతోనే తాము కమాండో దళాన్ని అప్రమత్తం చేసినట్లు, వారు కీకారణ్యంలో గాలిస్తూ ఉండగా ఎన్‌కౌంటర్ జరిగినట్లు ఎస్‌పి వివరించారు.