పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌లు
ఇడి డైరెక్టర్ ఎస్.కె.మిశ్రా పదవీకాలం ముగియడానికి మూడురోజుల ముందు వెలువడిన ఆర్డినెన్స్‌లు
ఇంతవరకు రెండేళ్లుగానే ఉన్న సిబిఐ, ఇడి పదవీకాలాలు
న్యూఢిల్లీ : కేంద్రీయ దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సంచాలకుల పదవీ కాలపరిమితి ఇకపై ఐదు సంవత్సరాల వరకూ ఉంటుంది. దీనిని అమలులోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్‌లు వెలువరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకంతో వెలువడిన ఆర్డినెన్స్‌లలో ఇందులోని అంశాలు తక్షణం అమలులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటివరకూ వీరికి అధికార గడువు రెండేళ్ల వరకూ ఉంది. అయితే దీనిని ఇప్పుడు గరిష్టంగా ఐదేళ్లకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం వెలువరించిన ఆర్డినెన్స్‌లలో తెలియచేసింది. వీనిత్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో సిబిఐ, ఇడి డైరెక్టర్ల పదవీకాల పరిమితిని వారి నియామక తేదీ నుంచి రెండేళ్ల వరకూ ఖరారు చేశారు. అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణల) ఆర్డినెన్స్ ఇప్పుడు జారీ అయింది.
అది కూడా ఇడి ప్రస్తుత డైరెక్టర్ ఎస్‌కె మిశ్రా ( 1984 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి) అధికార గడువు ముగియడానికి మూడు రోజుల ముందే వెలువడింది. ఈ అధికారికి కేంద్ర ప్రభుత్వం 2020లో ఏడాది పదవీకాల పొడిగింపును కల్పించింది. ఆయన రెండేళ్ల నిర్ణీత గడువు అప్పట్లో ముగిసిన దశలో ఈ అవకాశం కల్పించారు. అయితే ఈ అంశం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రభుత్వం కల్పించిన పొడిగింపును సుప్రీంకోర్టు కొట్టివేయలేదు. కానీ నవంబర్ 17కు మించి ఆయన పదవీలో ఉండటానికి వీల్లేదని గడువు ఖరారు చేసింది. కానీ ఇప్పుడు కేంద్రం డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల స్థాయికి పొడిగిస్తూ ఏకంగా తాజాగా ఆర్డినెన్స్‌ను వెలువరించడంతో ఇప్పుడు మిశ్రా ఈ పదవిలోనే ఉండటానికి అవకాశం ఏర్పడింది. అయితే ఆయనను ఇడి చీఫ్‌గా కొనసాగిస్తారా? లేదా అనేది ఇప్పటికైతే స్పష్టం కాలేదు.