ఎస్బిఐ ఎటిఎంలే టార్గెట్
రెండేళ్లలో రూ.5లక్షలు దోచుకున్న నిందితులు
పరారీలో ముగ్గురు నిందితులు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: ఎటిఎం కేంద్రంగా మోసాలు చేస్తున్న ఐదుగురు నిందితులను చార్మినార్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రెంబు బైక్‌లు, మూడు ఆటోలు, ఐదు మొబైల్ ఫోన్లు, 11 ఎటిఎం కార్డులు, రూ.2,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రం, పాల్వాల్ జిల్లా, నాటోలి గ్రామానికి చెందిన ఎండి ఇర్షాద్ అహ్మద్, ఎండి ఆసిమ్ ఖాన్, రిజ్వాన్ ఖాన్, ముస్తాక్ ఖాన్, ఆసిఫ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముబీన్ అహ్మద్, అబిద్ ఖాన్, జాబిద్ ఖాన్ పరారీలో ఉన్నారు. ఎనిమిది మంది నిందితులు, వారి బంధువులు కలిసి హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్, ఐడిఎఫ్సి బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఎటిఎం కార్డులు తీసుకుని వాటితో ఎస్బిఐ ఎటిఎంలను టార్గెట్‌గా చేసుకుని నేరాలు చేస్తున్నారు.
ఆగస్టు,2021లో నిందితులు కలిసి నగరానికి వచ్చారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బిఐ ఎటిఎం కేంద్రంగా నేరాలు చేస్తున్నారు. ఎటిఎం కార్డులను ఉపయోగించి క్యాష్ తీసేందుకు యత్నిస్తున్నారు. క్యాస్ బయటికి వస్తున్న సమయంలో చేతిని పెట్టి డబ్బులను ఆపివేస్తున్నారు. తర్వాత డబ్బులను చేతులతో తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకున్నా టెక్నికల్ ఎర్రర్‌గా చూపించడంతో ట్రాన్జాక్షన్ పూర్తి కానట్లు చెబుతోంది. తర్వాత నిందితులు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు డిడక్ట్ అయ్యాయని కాని తనకు రాలేదని చెప్పడంతో బ్యాంక్ అధికారులు తిరిగి ఖాతాకు జమ చేస్తున్నారు. ఇలా నిందితులు గత రెండేళ్ల కాలంలో రూ.5లక్షలు దోచుకున్నారు. ఎబిఐ ఎటిఎంల వద్ద సెక్యూరిటీ లేకపోవడంతో వాటిని టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నారు.
ఇద్దరు నిందితులు ఎటిఎంలోపలికి వెళ్లగా, మిగతా వారు పరిసరాలను గమనిస్తున్నారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలా ఎటిఎం మిషన్ నుంచి రూ.53,000 విత్‌డ్రా చేశారు. సిసిటివి ఫుటేజ్‌లో అనుమానస్పదంగా వ్యక్తులు కన్పించడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి తీసుకుని వచ్చారు. విలేకరుల సమావేశంలో సౌత్‌జోన్ డిసిపి గజేంద్ర భూపాల్, ఇన్స్‌స్పెక్టర్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.