పథనంతిట్ట(కేరళ): శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి రెండు నెలలు పాటు సాగే వార్షిక మండలం-మకరవిళక్కు యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఒక పక్క కరోనా వైరస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. మరోపక్క భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా వందలాది మంది భక్తులు కొండలు, గుట్టలు ఎక్కుతూ అయ్యప్పస్వామి దర్శనం కోసం ముందుకు సాగుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన పూజారి ఎన్ పరమేశ్వరన్ నంబూద్రి గర్భగుడిలో దీపాన్ని వెలిగించి, ఆలయ ద్వారాలను భక్తుల దర్శనం తెరిచిన అనంతరం భక్తులను కొండ ఎక్కడానికి అధికారులు అనుమతించారు. కరోనా వైరస్ పరిస్థితితో భారీ వర్షాలను పురస్కరించుకుని గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా భక్తులను వర్చువల్ క్యూ పద్ధతిలో ఆలయంలోని అనుమతిస్తుతన్నారు. సాధారణంగా ఈ మాసంలో తొలి రోజున సన్నిధానం క్యూ కాంప్లెక్స్ భక్తులతో కిటకిటలాడుతుండేది.
అయితే ఈ ఏడాది మాత్రం మొదటిరోజు ఉదయం భక్తుల సంఖ్య పలచగా కనిపించింది. భారీ వర్షాల కారణంగా మరో మూడు, నాలుగు రోజుల వరకు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. పంపానదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉన్న కారణంగా ఈ ఏడాది భక్తులను పంపా స్నానానికి అనుమతించడం లేదని అధికారులు చెప్పారు. కొవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్‌లో రోజుకు 30 వేల మంది భక్తులను మాత్రమే వర్చువల్ క్యూ పద్ధతిలో దర్శనానికి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ నిబంధనలను భక్తులు కచ్ఛితంగా పాటించాల్సి ఉంటుంది. ఆలయాన్ని సందర్శించే భక్తులు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సినేషన్ వేసుకుని ఉండాలి లేదా 72 గంటల ముందు ఆర్‌టి-పిసిఆర్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకుని ఉండాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 41 రోజుల మండల పూజా మహోత్సవం డిసెంబర్ 26న ముగియనున్నది. మకరవిళక్కు ఉత్సవం కోసం ఆలయం తిరిగి డిసెంబర్ 30న ప్రారంభమవుతుందని వారు చెప్పారు.