కేంద్ర నిర్ణయం పట్ల సిక్కుల హర్షం
న్యూఢిల్లీ: బుధవారం నుంచి కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తిరిగి తెరవనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. ఈ కారిడార్ సిక్కుల పవిత్రస్థలాల్లో ఒకటైన పాకిస్థాన్‌లోని దర్బార్‌సాహిబ్ గురుద్వారాను కలుపుతుంది. సిక్కు మత స్థాపకుడు గురునానక్‌దేవ్ ఈ గురుద్వారాలోనే తన చివరి రోజుల్ని గడిపారు. శుక్రవారం గురునానక్ జయంతి కావడంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల సిక్కులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురునానక్ పట్ల, సిక్కు మతస్థుల పట్ల మోడీ ప్రభుత్వానికున్న గౌరవానికి తమ నిర్ణయం నిదర్శనమని అమిత్‌షా అన్నారు. కేంద్ర నిర్ణయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌చన్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్‌సింగ్‌సిద్ధు, మాజీ సిఎం అమరీందర్‌సింగ్, బిజెపి జాతీయ కార్యదర్శి తరుణ్‌చుగ్, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్‌బాదల్ స్వాగతించారు. కర్తార్‌పూర్ కారిడార్‌పై భారత్,పాక్ మధ్య 2019, అక్టోబర్ 24న ఒప్పందం జరిగింది. 45 కిలోమీటర్ల ఈ మార్గంలో భారత యాత్రికులను ఎలాంటి వీసా లేకుండా అనుమతించేందుకు పాక్ అంగీకరించింది. 2019 నవంబర్‌లో ఈ మార్గాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.