ఈ కరెన్సీతో లోతైన సమస్యలు ఉన్నాయి
ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ : దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్‌గా మారిన క్రిప్టోకరెన్సీ వంటి కొత్త తరం కరెన్సీలతో జాగ్రత్త వహించాలని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. క్రిప్టోకరెన్సీలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటితో లోతైన సమస్యలు ఉన్నాయని అన్నారు. ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నిర్వహించిన బ్యాంకింగ్ సమావేశంలో దాస్ మాట్లాడుతూ, ఆర్థిక కొలమానాలు మెరుగుదలను సూచిస్తున్నాయని అన్నారు. ఇదే సందర్భంగా క్రిప్టోకరెన్సీపై స్పందిస్తూ, ఆర్‌బిఐ తర్వాత అంతర్గత చర్చలు జరిగాయని, ఈ కరెన్సీతో స్థూల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. దీంతో ఉన్న లోతైన సమస్యల కారణంగా క్షేత్రస్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం ఉందని, దీంతో మరింత స్పష్టత వస్తుందని అన్నారు. క్రిప్టో కరెన్సీలో ప్రస్తుత ట్రేడింగ్ అంకెలపై ఆర్‌బిఐ గవర్నర్ సందేహాలు వ్యక్తం చేశారు. రుణాలను ఆఫర్ చేయడం ద్వారా ఖాతాలను తెరిచేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. లావాదేవీల విలువ, వర్చువల్ కరెన్సీల్లో ట్రేడింగ్ పెరిగింది, ఖాతాల సంఖ్య ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. గతవారం కూడా దాస్ ఈ క్రిప్టోకరెన్సీలపై ఆందోళన వ్యక్తం చేశారు.