రణరంగాన్ని తలపించిన బిజెపి చీఫ్ బండి సంజయ్ పర్యటన
బండి పర్యటనకు వ్యతిరేకంగా టిఆర్‌ఎస్ నల్లజెండాల నిరసన
సూర్యాపేట జిల్లా అర్వపల్లి, ఆత్మకూరు(ఎస్) ధాన్యం కేంద్రాల వద్ద ఉద్రిక్తత
ప్రతిగా బిజెపి నినాదాలు, కర్రలు, రాళ్లు, కోడిగుడ్లతో ఇరుపార్టీల ఘర్షణ, బండి సహా రెండు పార్టీల నేతలపై కేసులు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌కు గుండెనొప్పి, ఆసుప్రతికి తరలింపు
మనతెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు బండి సంజయ్ నల్లగొండ, సూర్యాపేటలో పర్యటించి ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందనే విషయాన్ని రైతులకు వివరించే ప్రయత్నాలు చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడి యా సమావేశంలో మాట్లాడిన అనంతరం అర్వపల్లి కేంద్రానికి చేరుకున్నారు. వందలాది కార్ల కాన్వాయితో బండి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడి టిఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నల్ల జెండాలు చేబూని బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అడ్డుకునేందుకు దూసుకువచ్చారు. నల్లగొండలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో బిజెపికి చెందిన కార్యకర్తలు కూడా భారీ ఎత్తున సంజయ్ వెంట తరలివచ్చారు. ఇరు పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు ఒకరిపై మరొకరు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు ఇరు వర్గాలను చెదరకొట్టారు. పరిస్థితి కాస్త సద్దుమనిగిన వెంటనే అక్కడి నుంచి ఆత్మకూర్ (ఎస్) మండలంలోని ఐకెపి కేంద్రానికి బండి బయలు దే రారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టిఆర్‌ఎస్ శ్రేణులు బిజెపికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలిస్తూ బండి పర్యటనను అడ్డుకునేందకు ప్రయత్నించారు. బిజెపి శ్రేణులు సైతం తమ అధినేత పర్యటనకు బాసటగా నిలుస్తూ టిఆర్‌ఎస్ వాళ్లను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అర్వపల్లి, ఆత్మకూర్ (ఎస్)రెండు చోట్ల కూడా ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఘర్షణకు దారి తీసింది. కర్రలు, రాళ్లు, కోడిగుడ్లు విరుసుకోవడంతో ఇరు పా ర్టీలకు చెందిన కార్యకర్తలకూ గాయాలన్నాయి. ఆత్మకూర్‌ఎస్‌లో జరిగిన ఘర్షణ సమయంలో డ్యూటీలో ఉన్న రిజర్వు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు గుండెనొప్పి రావడంతో హుటాహుటిన ఆయనను సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. ఆత్మకూర్‌ఎస్ నుంచి తిరుమలగిరికి చేరుకున్న బండి స్థానిక మార్కెట్‌లో రైతులతో మాట్లాడారు.
వానాకాలం ధాన్యం కొనుగోళ్లల్లో జరుగుతున్న జాప్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు సంజయ్ దష్టికి తెచ్చారు. స్థానికంగా కూడా మీడియాతో మాట్లాడుతూ రాష్త్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. బాయిల్డ్ రైస్ మాత్రమే కొనుగోలు చేయరని, రా రైస్ ఎంత దిగుబడి వచ్చినా కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు. అనంతరం తన పర్యటనను ముగించుకుని జనగాంలో జరుగుతున్న పార్టీ పదాదికారుల సమావేశానికి వెళ్లారు. బండి వెంట ఆ పార్టీకి చెందిన రాష్త్ర నాయకులు ప్రేమేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రాఖేష్‌రెడ్డి, గోలి మధుసూధన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పాదూరి కరుణ, సంకినేని వెంకటేశ్వర్‌రావు తదితరులున్నారు.
ముగిసిన రెండు రోజుల పర్యటన..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బండి సంజయ్ రెండు రోజుల పర్యటన ముగిసింది. వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా రాష్ఠ్ర ప్రభుత్వాం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చే పట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. నల్లగొంలోని ఆర్జాలబావి, శెట్టిపాలెం, కుక్కడం, యాద్గారిపల్లి, చిల్లెపల్లి, గడ్డిపల్లి, అనంతారం, తాళ్లకమ్మపాడు ఐకేపి కేంద్రాల్లో పర్యటించి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. రైతుల్ని కలిసి వారి ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. మిల్లర్ల లాభాల కోసం రైతుల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాల వల్లనే గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. బిజెపి నేతల పర్యటను అడ్డుకునేందుకు టిఆర్‌ఎస్ శ్రేణులు రెండు రోజుల పాటు ప్రయత్నించా రు. బండి పర్యటించిన అన్ని సెంటర్లలోనూ టిఆర్‌ఎస్ నుంచి నిరసన సెగ తగిలింది. దీంతో బిజెపి శ్రేణులు సైతం బారీగా బండి వెంట నడిచి ఘర్షణకు దిగారు.
బండితోపాటు ఇరు పార్టీల నాయకులపై కేసులు
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ముందస్తు అనుమతులు తీసుకోకుండా నల్లగొండ జిల్లాలో పర్యటించి ఘర్షణలకు కారణమైనందున బిజెపి అధ్యక్షులు బండి సంజయ్‌తో పాటు బిజెపి నాయకులు, టిఆర్‌ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల పరి శీలన కోసం వచ్చిన బిజెపి నేతలు ముందస్తుగా అనుమతి తీసుకోలేదని, నల్లగొండకు వచ్చిన తర్వాత అనుమతి కోరారన్నారు. ఐదారు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెనకొల్పడమే కాకుండా ఘర్షణలకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కల్గించినందుకు గాను కెమెరాల ఆధారంగా వ్యక్తుల్ని గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు.