Friday, November 22, 2024

ఆర్‌బిఎల్ నకిలీ కాల్ సెంటర్…

- Advertisement -
- Advertisement -

Cyberabad police bust fake RBL call centre

స్పూఫింగ్ కాల్స్ చేస్తున్న నిందితులు
బ్యాంక్ అధికారులమని చెప్పి మోసం
ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో కాల్ సెంటర్లు
క్రెడిట్ కార్డు పేరుతో ఛీటింగ్
దేశవ్యాప్తంగా రూ.3 కోట్లు కొట్టేసిన నిందితులు
16మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: బ్యాంక్ అధికారులమని ఫోన్ చేసి ఖాతాదారులు డబ్బులు కొట్టేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. 16మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరో ఏడుగురు నిందితుల కోసం వెతుకుతున్నారు. నిందితులు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రూ.3కోట్లు కొట్టేశారు. వారి వద్ద నుంచి పోలీసులు రూ.15లక్షల నగదు, బిఎండబ్లూ కారు, మరో రెండు కార్లు, బైక్, నకిలీ ఆధార్‌కార్డులు 865, 1,000 సిమ్ కార్డులు, చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, 34 మొబైల్ ఫోన్లు, రబ్బర్ స్టాంప్‌లు, బయోమెట్రిక్ మిషన్లు, పిఓఎస్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

న్యూఢిల్లీకి చెందిన దీపక్ చౌదరి, విశాల్ కుమార్ అలియాస్ విశాల్ చౌహాన్, కృష్ణన్‌కుమార్ గులియా, కరణ్‌కుమార్, గౌరవ్ శర్మ, ఆకాశ్ శర్మ, ధనుంజయ్ కుడానియా, దుర్గేష్ కుమార్ జా, అశుతోష్ కుమార్, లతా, ముస్కాన్, అమన్, అనితా, విశాల్‌కుమార్, మోహిత్ కుమార్, దీపు మన్‌వాని, రవిభాటి, రాహుల్ నాగ్‌పాల్, రాజింద్ర కుమార్, కునాల్ కపూర్, చేతన్ నాగ్‌పాల్, రజిని చౌదరి, కోమల్ చౌదరీ కలిసి నకిలీ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో దీపక్ చౌదరి, విశాల్ కుమార్ గతంలో ఆర్‌బిఎల్ బ్యాంక్‌లో పనిచేశారు. వీరికి బ్యాంక్ రంగం గురించి పూర్తి అవగాహన ఉంది. క్రెడిట్ కార్డు కోసం కస్టమర్ల నుంచి ఏ వివరాలు తీసుకోవాలో బాగా తెలుసు. దీనిని ఆసరాగా చేసుకున్న నిందితులు ఢిల్లీలోని మోహన్ గార్డెన్, ఉత్తం నగర్‌లో ఆరు కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ హోటల్‌లో కూడా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆర్‌బిఎల్ బ్యాంక్ అధికారులమని చెప్పి స్పూఫింగ్ కాల్స్ చేస్తూ బ్యాంక్ ఖాతాదారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు.

క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేయాలంటే ముందుగా ఓటిపి చెప్పాలని చెప్పడంతో బాధితులు తమకు సంబంధించిన పాన్ నంబర్, తదితర వివరాలు అన్ని చెబుతున్నారు. అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటిపి చెప్పడంతో బాధితుల బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. దీంతో చాలామంది బాధితులు అసలు క్రెడిట్ కార్డు ఉపయోగించుకోకుండానే డబ్బులు పోగొట్టుకున్నారు. దేశవ్యాప్తంగా బాధితుల నుంచి నిందితులు రూ.3కోట్లు కొట్టేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 34మంది డబ్బులు పొగొట్టుకోవడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. సైబర్ క్రైం ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తోపాటు ఆరుగురు సభ్యుల బృందం, ఢిల్లీ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు.

ఆరు వెబ్‌సైట్లు…

ఇలా కొట్టేసిన డబ్బులను నిందితులు ఆరు వెబ్‌సైట్లు, మూడు మర్చంట్ బ్యాంక్ ఖాతాలకు మళ్లించారు. WWW.ekartmobile.com,wwwglobalfashionfreak.com,www.globalbrandbucket.com,www.Ecash247.in, www.Ecash24/7.comలో మరో మూడు బ్యాంక్ ఖాతాలకు డబ్బులు మళ్లించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News