దుబాయి: భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మరో ప్రతిష్టాత్మకమైన పదవి దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా గంగూలీని నియమించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు భారత్‌కే చెందిన అనిల్ కుంబ్లే ఐసిసి క్రికెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2012 నుంచి కుంబ్లే ఈ పదవిలో కొనసాగుతున్నాడు. ఇప్పటికే మూడు పర్యాయాలు కుంబ్లే ఈ బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో ఐసిసి నిబంధనల ప్రకారం మరోసారి చైర్మన్ పదవిని చేపట్టే అవకాశం కుంబ్లేకు లేకుండా పోయింది. దీంతో అతని స్థానంలో బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఐసిసి ఈ బాధ్యతలు అప్పగించింది. త్వరలోనే గంగూలీ ఈ పదవిని చేపట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత కీలకమైన పదవుల్లో క్రికెట్ కమిటీ చైర్మన్ పదవి ఒకటి. ఈ పదవికి గంగూలీ అన్ని విధాల అర్హుడని ఐసిసి చైర్మన్ గ్రెగ్ బార్కే తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌లో గంగూలీకి అపార అనుభవం ఉందని, అంతేగాక బిసిసిఐ అధ్యక్షుడిగా కూడా అతను తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తుండడంతో గంగూలీ వైపు ఐసిసి పాలకమండలి మొగ్గు చూపిందని వివరించారు.