యుద్ధ విమానాలను మోహరించిన తైవాన్
చియాయి( తైవాన్): చైనానుంచి బెదిరింపులు పెరిగిపోతుండడంతో తైవాన్ తన వైమానిక దళంలో కొత్తగా ఆధునీకరించిన ఎఫ్16 యుద్ధ విమానాలను మోహరించింది. చియాయిలోని వైమానిక స్థావరంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో తైవాన్ అధ్యక్షుడు సాయ్‌యింగ్ వెన్ 64 ఆధునీకరించిన 64 ఎఫ్ 16 యుద్ధ విమానాలను వైమానిక దళానికి అప్పగించారు. తైవాన్ వైమానిక దళంలోని మొత్తం 141 పాత ఎఫ్16 యుద్ధ విమానాలను 2023 నాటికి పూర్తిగా తొలగించి కొత్తగా ఆధునీకరించిన యుద్ధ విమానాలను చేర్చాలని తైవాన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ కొత్త విమానాలను చేర్చారు. అమెరికా రక్షణ పరిశ్రమతో తైవాన్‌కు ఉన్న సహకార బలం ఏమిటో ఈ ఆధునీకరించిన యుద్ధ విమానాలు చాటి చెబుతున్నాయని ఈ సందర్భంగా సాయ్ అన్నారు. అమెరికా చైనా సంబంధాల్లో తాజా ఉద్రిక్తతలకు తైవాన్ కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. తైవాన్ తమ భూభాగంలో భాగమేనని వాదిస్తున్న చైనా ఇటీవలి కాలంలో తైవాన్ సరిహద్దు ప్రాంతాలకు భారీగా యుద్ధ విమానాలను తరలించింది. అంతేకాకుండా తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవడమంటే నిప్పుతో చెలగాటమాడడమేనని ఈ వారం ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు జో డైడెన్‌తో జరిగిన వర్చువల్ భేటీలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పరోక్షంగా హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.