Saturday, November 23, 2024

రైతు ఉద్యమ రథసారథులు వీరే…

- Advertisement -
- Advertisement -

Doctor, teacher, ex-police constable: men who led Farmers' agitation

న్యూఢిల్లీ: ఒక డాక్టరు, ఒక రిటైర్డ్ టీచరు, ఒక మాజీ సైనికోద్యోగి, ఒక మాజీ ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్.. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు మార్గనిర్దేశం, రూపకల్పన చేసిన రథసారథులలో ఉన్నారు..ఏడాదికి పైగా రైతుల నిరసనల అనంతరం ఈ మూడు చట్టాలను ఉపసంహరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన నిరసనలకు నాయకత్వం వహించిన రైతు నాయకులలో కొందరి గురించి తెలుసుకుందాం..

రాకేష్ తికాయత్-భారతీయ కిసాన్ సంఘ్(బికెయు) జాతీయ ప్రతినిధి: పోలీసు కానిస్టేబుల్‌గా ఢిల్లీలో ఒకప్పుడు పనిచేసిన తికాయత్ వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల రాజకీయాలలో గతంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న 52 ఏళ్ల తికాయత్ బికెయుతో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌కే ఒకప్పుడు పరిమితమైన తికాయత్ రైతుల ఆందోళన సందర్భంగా ఢిల్లీ శివార్లకు చేరుకుని జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాకాండ తర్వాత విలేకరుల సమావేశంలో తికాయత్ మాట్లాడుతూ కంటతడి పెట్టుకోవడంతో రైతుల నిరసనోద్యమానికి దేశవ్యాప్తంగా నూతన చైతన్యం వచ్చింది.

దర్శన్‌పాల్ సింగ్-అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ వర్కింగ్ గ్రూపు సభ్యుడు: వృత్తిరీత్యా ఎంబిబిఎస్ వైద్యుడైన

70 ఏళ్ల పాల్ వ్యవసాయ చట్టాలపై కేంద్ర, రాష్ట్ర నాయకుతలతో చర్చలు జరపడంలో చురుకైన భూమిక పోషించారు. రైతు సంఘాలను సమన్వయ పరచడంలో కీలక పాత్ర పోషించిన పాల్ ప్రభుత్వంతో జరిగిన చర్చలలో సమన్వయకర్తగా వ్యవహరించారు. ఉద్యమాన్ని పంజాబ్ నుంచి ఇతర రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రకు వ్యాప్తి చేయడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.

జోగీందర్ సింగ్ ఉగ్రహన్, బికెయు(ఉగ్రహన్) అధ్యక్షుడు: మాజీ సైనికోద్యోగి అయిన ఉగ్రహన్ రైతు నాయకులలో బాగా ఆదరణ పొందిన వ్యక్తి. రైతుల ఆందోళనలో ముందు వరుసలో ఉన్న ఆయన తన అనుచర బృందంతో కలసి రైల్ రోకో, బిజెపి నాయకుల ఘోరావ్ వంటి కార్యక్రమాలతో పంజాబ్‌లో ఉద్యమంలో దూకుడు వైఖరిని తీసుకువచ్చారు. సింఘు సరిహద్దుల వద్ద దాదాపు అన్ని రైతు సంఘాలు నిరసన తెలియచేయగా ఆయన సంఘం మాత్రం ఒంటిచేత్తో టిక్రి సరిహద్దును మూసివేసింది.
బల్బీర్ సింగ్ రజేవల్-బికెయు అధ్యక్షుడు: రైతుల అభిప్రాయాలను కేంద్ర మంత్రులకు విశదీకరించడంలో ఎంతో నేర్పు చూపించిన వ్యక్తి. ఆందోళనలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన, వాటి అమలు కోసం జరిగిన 31 రైతు సంఘాల సమావేశాలలో పాల్గొన్న కొద్ది మంది ముఖ్య నాయకులలో 78 ఏళ్ల రజేవల్ ఒకరు.

హన్నన్ మొల్లా-సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి: నిరసనల సందర్భంగా కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పదేపదే పట్టుపట్టిన నాయకులలో 75 ఏళ్ల హన్నన్ మొల్లా ఒకరు. పార్లమెంట్ ప్రక్రియ ద్వారా వ్యవసాయ చట్టాల రద్దు జరిగే వరకు ఆందోళన కొనసాగి తీరుతుందని ఆయన మొదటి నుంచి స్పష్టం చేస్తూ వచ్చారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర కోసం చట్టం తీసుకువచ్చేవరకు పోరాటం సాగుతుందని ఆయన నినదించారు.

గుర్నామ్ సింగ్ చదుని- బికెయు, హర్యానా అధ్యక్షుడు: మూడు వ్యవసాయ చట్టాలు పార్లమెంట్‌లో ఆమోదం పొందడానికి ముందే రైతులను సమీకరించడంలో కీలక పాత్ర పోషించిన 65 సంవత్సరాల గుర్నామ్ సింగ్ గతంలో అనేక ఉద్యమాలను విజయవంతంగా నిర్వహించడమే కాక వినూత్నంగా నిరసనలు తెలియచేయడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. చొక్కాలు లేకుండా అర్ధనగ్న నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు నిర్వహించడం, రాష్ట్ర హైవేలపై ఆలుగడ్డలు పారబోయడం వంటి ఆయన నిరసనలలో చోటుచేసుకున్నాయి. ఆయన పిలుపు మేరకే నిరసనకారులు కర్నల్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ పాల్గొన్న బిజెపి కార్యక్రమానికి హాజరై తమ నిరసన తెలియచేశారు. ఈ సభలోనే నిరసనకారులపై పోలీసు లాఠీలు విరిగి అనేక మంది రైతులు గాయపడగా ఖత్తర్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

సుఖ్‌దేవ్ సింగ్ కొక్రికలాన్, బికెయు(ఉగ్రహన్) ప్రధాన కార్యదర్శి: రిటైర్డ్ స్కూల్ టీచరైన ఈ 71 ఏళ్ల రైతు నాయకుడు ఢిల్లీ ఛలో ఆందోళనలో ముందుండి పలుమార్లు పోలీసులతో తలపడ్డారు.

ప్రభుత్వం, రైతులు మొత్తం 11 సార్లు చర్చలు జరపగా.. ప్రతిష్టంభన తొలగించి రైతుల నిరసనను ముగించడానికి చివరిసారి జనవరి 22న చర్చలు జరిగాయి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో చర్చలు పునరుద్ధరణ కాలేదు.

రైతులతో ప్రభుత్వం తరఫున ముగ్గురు కేంద్ర మంత్రులు సంప్రదింపులు జరిపారు:

నరేంద్ర సింగ్ తోమర్-కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి: రైతులతో అనేక దఫాలు చర్చలలో పాల్గొన్న తోమర్ ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా ఉందని చెబుతూ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ నిరసనను విరమించాలని అనేక సందర్భాలలో రైతులకు విజ్ఞప్తి చేశారు.

పియూష్ గోయల్- వాణిజ, వినిమయ వ్యవహారాల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి: రైతులతో చర్చలలో కీలక పాత్ర పోషించిన గోయల్ కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు అనుకూలమైనవిగా అనేక సందర్భాలలో చెప్పడమే కాక చర్చల ద్వారా దీనికి పరిష్కారం కనుగొందామని విజ్ఞప్తి చేశారు.

సోమ్ ప్రకాశ్-వాణిజ్య శాఖ సహాయ మంత్రి: రైతులతో జరిగిన చర్చలలో పాల్గొన్న సోమ్ ప్రకాశ్ యావద్దేవ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని రైతులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్-శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు: వ్యవసాయ చట్టాలపై ఏర్పడిన వివాదం బిజెపికి చిరకాల, సన్నిహిత భాగస్వామ్య మిత్రుడిని దూరం చేసింది. పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిన రోజున వీటిని వ్యతిరేకిస్తూ తన భార్య హర్‌సిమ్రత్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారని పార్లమెంట్‌లోనే బాదల్ ప్రకటించి సంచలనం సృష్టించారు. వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో బాదల్ ప్రసంగిస్తూ ప్రతిపాదిత చట్టాలు గడచిన 50 ఏళ్లుగా పంజాబ్ ప్రభుత్వాలు, రైతులు వ్యవసాయ రంగం అభివృద్ధికి సాగించిన కృషిని నాశనం చేస్తాయని చెప్పారు. అనంతరం కేంద్ర ఆహార తయారీ పరిశ్రమ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు హర్‌సిమ్రత్ కౌర్ ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News