బాలీ: ప్రతిష్టాత్మకమైన ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు విజయం సాధించింది. టర్కీకి చెందిన నెస్లిహాన్ ఇగిట్‌తో జరిగిన పోరులో భారత అగ్రశ్రేణి షట్లర్ సింధు జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ప్రత్యర్థి ఇగిట్‌పై పూర్తి ఆధిపతత్యం చెలాయించిన సింధు 2113, 2110 తేడాతో జయభేరి మోగించింది. సింధు ధాటికి ఇగిట్ ఎదురు నిలువలేక పోయింది. తన మార్క్ షాట్లతో అలరించిన సింధు వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది.
ఇక పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ కూడా సెమీస్‌కు చేరుకున్నాడు. భారత్‌కే చెందిన హెచ్.ఎస్. ప్రణయ్‌తో జరిగిన పోరులో శ్రీకాంత్ విజయం సాధించాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీకాంత్ 217, 2118 తేడాతో ప్రణయ్‌ను ఓడించి ముందంజ వేశాడు. తొలి సెట్‌లో శ్రీకాంత్ అలవోక విజయాన్ని అందుకున్నాడు. అయితే రెండో సెట్‌లో అతనికి సహచరుడు ప్రణయ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కానీ ఆఖరు వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నశ్రీకాంత్ సెమీస్‌కు చేరుకున్నాడు.