Friday, November 22, 2024

క్రికెట్‌కు డివిలియర్స్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

AB. De Villiers announces retirement from all formats of cricket

అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్న ప్రకటన

జోహెన్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఎబి. డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే డివిలియర్స్ సౌతాఫ్రికా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే అతను ఐపిఎల్‌లో మాత్రం కొనసాగుతూ వచ్చాడు. తాజాగా ఐపిఎల్‌తో సహా అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు శుక్రవారం సంచలన ప్రకటన చేశాడు. డివిలియర్స్ నిర్ణయం అతని అభిమానులకు షాక్‌కు గురి చేసింది. అంతేగాక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు డివిలియర్స్ నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా పిలిచే డివిలియర్స్ బెంగళూరు ప్రధాన అస్త్రాల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే కొంతకాలంగా డివిలియర్స్ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేక పోతున్నాడు.

యుఎఇ వేదికగా జరిగిన ఐపిఎల్ రెండో దశ మ్యాచుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆటకు పూర్తి స్థాయి న్యాయం చేయలేక పోతున్న తాను క్రికెట్ నుంచి తప్పుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చానని డివిలియర్స్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఇక తనపై ఎంతో నమ్మకంతో తమ ఫ్రాంచైజీల్లో ఆడే అవకాశం కల్పించిన ఆయా జట్లకు డివిలియర్స్ కృతజ్ఞతలు తెలిపాడు. దక్షిణాఫ్రికా, బెంగళూరు, టైటాన్స్ ఇలా ఎన్నో జట్లు తనకు అవకాశాలు ఇచ్చాయని, తనపై ఉంచిన నమ్మకానికి సదా రుణపడి ఉంటానని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇన్నేళ్లు క్రికెటర్‌గా కొనసాగడం అద్భుతమైన ప్రయాణమని, కానీ ప్రస్తుతం ఆట మొత్తానికే వీడ్కోలు పలకాల్సిన సమయం అసన్నమైందని పేర్కొన్నాడు. ఇకపై ఏ లీగ్‌లోనూ తాను ఆడే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు.

కోహ్లి భావోద్వేగం..

మరోవైపు డివిలియర్స్ షాకింగ్ నిర్ణయంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. డివిలియర్స్‌తో కోహ్లి విడదీయరాని ఆత్మీయ అనుబంధం ఉంది. దీంతో తన అప్తమిత్రుడు, మిస్టర్ 360 తీసుకున్న నిర్ణయంపై కోహ్టి ట్విటర్ వేదికగా స్పందించాడు. ఈ నిర్ణయం నా మనస్సును ఎంతో గాయపరిచింది. వ్యక్తిగత జీవితం, కుటుంబం కోసం సమయం కేటాయించేందుకు నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందేనని భావిస్తున్నా. ఐ లవ్ యూ బ్రదర్ ఎబిడి. మన తరంలో నువ్వే అత్యుత్తమ ఆటగాడివి. నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తివి నువ్వే. ఆర్‌సిబి కోసం నువ్వు చేసిన, అందించిన సహకారం ఎప్పటికీ మరచిపోలేనిది. నిన్ను చూసి ప్రపంచం మొత్తం గర్విస్తోంది. మన అనుబంధం ఆటలోనే కాదు.. ఎల్లవేళలా ఉంటుందని భావిస్తున్నా. నీవు లేకుండా ఆర్‌సిబిని ఊహించలేమని కోహ్లి తన ట్విట్‌లో పేర్కొన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News