ఆగ్రా : ఉత్తరప్రదేశ్‌లో ఇక్కడి జిల్లా ఆసుపత్రి వైద్యులకు శుక్రవారం చిత్రమైన కృష్ణానుభవం ఎదురైంది. వైద్యులు తమ విధి నిర్వహణలో ఉండగా పూజారి లేఖ్‌సింగ్ పరుగున అక్కడికి వచ్చారు. చేతుల్లో చేయి విరిగిన కృష్ణ ప్రతిమ ఉంది. ఎంతో ఆత్రుతతో ఆ పూజారి డాక్టర్ల వద్దకు వెళ్లి వెంటనే తన కృష్ణుడికి తెల్లవారుజామున స్నానం చేయిస్తుండగా చేయి విరిగిందని, వెంటనే కుట్టు వేసి చికిత్స జరపాలని వేడుకున్నారు. దీనితో ఆసుపత్రి సిబ్బంది కంగుతింది. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో వెంటనే చికిత్సకు తీసుకుంటున్నట్లు తెలిపి, శ్రీ కృష్ణ అనే పేరున చిట్టీరాశారు. వెంటనే విగ్రహానికి బ్యాండేజ్ వేశారు. తన లడ్డూ గోపాల్‌కు గాయం అయిందని ఈ పూజారి కళ్లనీళ్లు పెట్టుకున్న వైనం వీడియోలో బందీ అయింది. నెట్‌లోకి జారుకుంది. తనకు ఈ కృష్ణుడు అంతా అని, సర్వస్వం అని గాయపడితే తన మనసు తల్లడిల్లదా? అందుకే వెంటనే వైద్యుల వద్దకు తీసుకువచ్చానని తన గోడు వెలిబుచ్చారు.