బస్తీ (యూపి) : వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ శుక్రవారం ప్రకటించినా, కేంద్ర మంత్రి వి.కె. సింగ్ మాత్రం రైతు నాయకులను తప్పుపడుతూ శనివారం వ్యాఖ్యలు చేశారు. ‘ఆ వ్యవసాయ చట్టాల్లో నలుపు అంటే ఏమిటని రైతునాయకుడు ఒకరిని అడిగాను. మీరంతా ఈ చట్టాలు నల్ల చట్టాలు అని అంటున్నారు కదా…అందులో సిరా నలుపు రంగు తప్ప ఇంకేముంది ? అని ప్రశ్నించినట్టు మంత్రి విలేఖరుల ఎదుట వ్యాఖ్యానించారు. దానికి ఆ రైతు నాయకులు తన మాటలను ఒప్పుకున్నప్పటికీ ఇంకా నల్లచట్టాలు గానే పేర్కొన్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
సిద్దార్ధనగర్ జిల్లాలో ఒక కార్యక్రమానికి వెళ్తూ మంత్రి విలేఖరులతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాల వల్ల చిన్నరైతులకు కలిగే ప్రయోజనాల గురించి రైతు సంఘాల నాయకులు పట్టించుకోకుండా వారిలో వారు ఆధిపత్య పోరు సాగించారని మంత్రి విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ బలవంతంగా వ్యవసాయ చట్టాల రద్దుకు నిర్ణయం తీసుకున్నారని ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణను ప్రస్తావించగా, వ్యవసాయం గురించి ఆయనకేమీ తెలియదని మంత్రి వ్యాఖ్యానించారు. స్వామినాధన్ సిఫార్సులను ప్రభుత్వం అమలు లోకి తెచ్చిందని పేర్కొన్నారు.