స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనువరాలి పెళ్లి సందర్భంగా చాలాకాలం తర్వాత కలుసుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్
మన తెలంగాణ/హైదరాబాద్ : చాలా రోజుల తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక వేదికపై ప్రత్యక్షమమయ్యారు. దీనికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలి వివాహ ప్రాంగణం వేదికైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిలు ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. పక్కపక్కనే ఆసీనులయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. చాలా సరదగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు.శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం ఎపి సిఎం ఒఎస్‌డి కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డితో ఆదివారం హైదరాబాద్ శంషాబాద్‌లోని విఎన్‌ఆర్ ఫామ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. గతంలో ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం వారిద్దరు కలుసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
అయితే ఈ వివాహ వేడుకల్లో ఇద్దరు సిఎంలు పక్కపక్కనే కూర్చోని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కాసేపు సరదాగాముచ్చటించుకున్నారు. అనంతరం వేదిక మీదకు వెళ్లి వధువరూలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ఎపి నుంచి సిఎం జగన్‌తో పాటు ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మీ, ఆ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సిఎం పుష్పశ్రీవాణి తదితరులు హాజరు కాగా, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర గవర్నర్ తమిళిసై, తెలంగాణ రాష్ట్ర పక్షాన సిఎం కెసిఆర్‌తో టిఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత, ఎంపి నామ నాగేశ్వరరావు, మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌యాదవ్, ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, టిఆర్‌స్ నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కాగా ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక వేదికపై చాలా సరదగా గడపడం…వంటి ఘటనలు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.