ప్రత్యేక కోర్టులో ఇడి వాదన
ముంబయి: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కుమారుడు హృషికేష్ దేశ్‌ముఖ్ మనీ లాండరింగ్‌లో చురుకైన పాత్ర పోషించారని, అక్రమంగా సంపాదించిన సొమ్మును స్వచ్ఛంద విరాళంగా చిత్రీకరించడంలో తన తండ్రికి ఆయన సాయపడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం ప్రత్యేక కోర్టుకు తెలియచేశారు. హృషికేష్ దేశ్‌ముఖ్ దాఖలు చేసిన ముందస్టు జామీను పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఇడి అధికారులు ప్రత్యేక కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు.
మనీ లాండరింగ్ కార్యకలాపాలలో హృషికేష్ చురుకుగా పాల్గొంటున్నారని, తన తండ్రి సంపాదించిన అక్రమ సంపాదనను వివిధ కంపెనీల నుంచి వచ్చిన విరాళాలుగా చూపడంలో అతను తన తండ్రికి సాయపడ్డారని ఇడి అధికారులు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అరెస్టు నుంచి ఆయనకు రక్షణ కల్పిస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వారు తెలిపారు. అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుటుంబం అధీనంలో 11 కంపెనీలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఇడి అధికారులు తెలిపారు. ఈ కంపెనీలలో అత్యధికంగా హృషికేష్ డైరెక్టర్‌గానో వాటాదారుగానో ఉన్నారని పేర్కొంది. కాగా.. హృషికేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.