మనతెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమి రాష్ట్రంలోని జర్నలిస్టులకు కోవిడ్ సమయంలో ఆర్థిక సాయంగా రూ.5 కోట్ల 56 లక్షల 30 వేల రూపాయలను అందజేసింది. కోవిడ్ బారినపడిన జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ మీడియా అకాడమి ఆదుకున్నదని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టిన ఈ నాలుగు నెలలలో ఇప్పటికీ 77 మంది కరోనా బారిన పడారని తెలిపారు. వారికి రూ.7. 70 లక్షలను మంగళవారం బ్యాంకులో జమ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 3909 మంది జర్నలిస్టులకు కరోనా సాయం అందించామని తెలిపారు. రాష్టంలోని అన్నిరంగాలను ప్రభావితం చేసిన కరోనా జర్నలిస్టులను తీవ్రంగా ఇబ్బందుల పాలు చేసిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం,- శిక్షణకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 3909 మంది జర్నలిస్టులకి ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు. మీడియా అకాడమిలో ఉన్న రూ.42 కోట్ల కార్పస్ ఫండ్ తో వచ్చిన వడ్డీ ఆధారంగా ఈ మొత్తాలను జర్నలిస్టులను అందజేశామన్నారు.