న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 543 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. గత కొద్ది కాలంగా వైరస్ వ్యాప్తి అదుపులో ఉండడంతో కొత్త కేసుల్లో భారీ తగ్గుదల నమోదవుతోంది. ఈమేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. సోమవారం 9,64,980 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 7579 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. గత ఏడాది మే నాటి స్థాయికి ఇవి పడిపోయాయి. సోమవారం కేరళలో 3698 మందికి కరోనా సోకింది. 180 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 236 గా ఉంది. ఇక ఇప్పటివరకు 3.45 కోట్ల మంది కరోనా బారిన పడగా, 4,66,147 మంది మృతి చెందారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,13,584 గా ఉంది. బాధితుల సంఖ్య 536 రోజుల కనిష్ఠానికి చేరింది. సోమవారం 12,202 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.39 కోట్లకు చేరాయి. క్రియాశీల రేటు o.33 శాతానికి పడిపోగా, రికవరీ రేటు 98.32 శాతానికి పెరిగింది. సోమవారం 71,92,154 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 117 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.