- Advertisement -
ఫోటోపై కేంద్రానికి కేరళ హైకోర్టు నోటీస్
కోచి: కొవిడ్19 వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రంపై ప్రధాని మోడీ ఫోటోను పెట్టడం ఏవిధంగా సమర్థనీయమో తెలపాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని ఫోటోను తన ధ్రువీకరణ పత్రంపై పెట్టడం ప్రాధమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ ఓ సీనియర్ సిటిజెన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు వివరణ కోరింది. మంగళవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.నాగరేశ్ ధర్మాసనం విచారణ జరిపింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న పీటర్ మ్యాలీపారంపిల్ ఈ పిటిషన్ వేశారు. తనకు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో ప్రధాని ఫోటో ఉండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడం వ్యక్తిగత అంశమని, అందుకు సంబంధించిన పత్రంపై ప్రధాని పోటో పెట్టడం ప్రైవసీలోకి చొరబాటుగా భావించాల్సి ఉంటుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రైవసీ పౌరుల ప్రాధమిక హక్కన్నది తెలిసిందే.
- Advertisement -