Friday, November 15, 2024

‘మహావీర్’ సంతోష్

- Advertisement -
- Advertisement -

Center honored Colonel Santosh Babu with Mahavira Chakra Award

గతేడాది లడఖ్‌లో చైనా సైన్యం దురాక్రమణను వీరోచితంగా ఎదుర్కొని అమరుడైన తెలంగాణ వీరజవాను కల్నల్ సంతోష్‌బాబుకు ప్రకటించిన ‘మహావీర్ చక్ర’ను మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాధ్ నుంచి స్వీకరిస్తున్న ఆయన భార్య, తల్లి. ఆపరేషన్ స్నో లియోపార్డ్‌లో సంతోష్‌బాబు శత్రువులను తుదముట్టిస్తూ దేశం కోసం ప్రాణాలను అర్పించారు. కల్నల్ సంతోష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5కోట్లు, బంజారాహిల్స్‌లో 700 గజాల స్థలాన్ని ఆయన భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే.

మనతెలంగాణ/హైదరాబాద్ : చైనా సరిహద్దు గాల్వాన్‌లో ప్రత్యర్థులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన కల్నల్ సంతోశ్ బాబును కేంద్రం మహవీర చక్ర పురస్కారంతో గౌరవించింది. ఈక్రమంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం నాడు జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో సంతోశ్ బూబు సతీమణి సంతోషి, తల్లి మంజుల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి మహావీర చక్ర పురస్కారం అందుకున్నారు. దేశానికి కల్నల్ సంతోష్‌బాబు చేసిన సేవలను స్మరిస్తూ మరణానంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో రక్షణా దళాలు చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా అందించే మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’ రెండో అత్యున్నత పురస్కారం. కాగా 2020 జూన్ నెలలో తూర్పు లద్దాఖ్ గల్వాన్ వ్యాలీలో చైనా ఆర్మీ దాడిని ప్రతిఘటించిన ఘటనలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు అమరుడైన విషయం తెలిసిందే. కల్నల్ సంతోశ్ బాబు 16 బిహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సమయంలో గాల్వన్ లోయ వద్ద చైనా సైన్యం దురాక్రమణకు యత్నించగా భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టారు.

జూన్ 15న జరిగిన ఈ ఘటనలో సంతోష్‌బాబుతో పాటు 21 మంది సైనికులు వీరమరణం పొందారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పుణెలో డిగ్రీ పూర్తి చేసిన సంతోష్‌బాబు 2004 డిసెంబర్‌లో జమ్మూలో తొలిసారి మిలటరీ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబర్‌లో కల్నల్‌గా పదోన్నతి రావడంతో బిహార్ 16వ బెటాలియన్ కమాండింగ్ అధికారిగా గాల్వన్ లోయల్లో విధులకు వెళ్లి ప్రత్యర్థులతో విరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో సంతోష్‌బాబు 2007లో సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించడంతో పాటు కొంతకాలం కాంగో దేశంలో కూడా విధులు నిర్వహించారు. ఇదిలావుండగా కల్నల్ సంతోష్‌బాబు వీరమరణం పొందటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగంతో పాటు రూ.4 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది. ప్రస్తుతం కల్నల్ సంతోష్‌కుమార్ సతీమణి యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News